జగనన్న చేదోడు కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు లబ్ధిదారుల ఖాతాల్లో రెండో ఏడాది నగదును జమ చేయనున్నారు. రెండో విడుత 2.85 లక్షల మంది రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీలకు రూ. 285 కోట్లను విడుదల చేయనున్నారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నగదు బదిలీ చేయనున్నారు.
రెండో విడుత నగదుతో కలిపి ఇప్పటి వరకూ జగనన్న చేదోడు కింద రూ.583 కోట్లు విడుదల చేసింది. ఏటా షాపులున్న ప్రతిఒక్కరికి జగనన్న చేదోడు కింద రూ.10వేల ఆర్ధిక సాయాన్ని ఏపీ ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ దఫా షాపులున్న 1.46 లక్షల మంది టైలర్లకు రూ.146 కోట్లు, షాపులున్న 98వేల మంది రజకులకు రూ.98.44 కోట్లు, షాపులున్న 40వేల మంది నాయీ బ్రాహ్మణులకు రూ.40 కోట్ల నగదును లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు.
లంచాలకు, వివక్షకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా, గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా డిస్ప్లే చేసి, సోషల్ ఆడిట్ నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేశారు. పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా, లబ్ధిదారుల ఖాతాలను అన్ఎన్కంబర్ చేయించి మరీ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది జగన్ ప్రభుత్వం.