మూడు రోజుల పాటు శ్రేణులకు అందుబాటులో..
కడప – ప్రభ న్యూస్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో మూడు రోజుల పర్యటన నిమిత్తం కడపకు చేరుకున్నారు. శనివారం మధ్యాహ్నం కడప ఎయిర్ పోర్టులో జగన్ కు పార్టీ శ్రేణులు సాదర స్వాగతం పలికాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు పి.రవీంద్రనాథ్ రెడ్డి, నగర మేయర్ సురేష్ బాబు తదితర నేతలున్నారు.
అక్కడ నుంచి వైయస్ జగన్ కాన్వాయ్ ఎయిర్ పోర్టు నుంచి బైపాస్ రోడ్డు, కృష్ణాపురం వైఎస్ఆర్ సర్కిల్ మీదుగా పెండ్లిమర్రి మండలంలోని పైడి కాలువ గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరిన వైయస్ జగన్ మాచునూరు గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు భారీ స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు చేరుకొని బాణసంచా పేలుస్తూ ఆయన స్వాగతం పలికారు.