Friday, November 22, 2024

CM JAGAN: ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లు’.. ప్రతీ పేదవాడి సొంతింటి కల!

ప్రతి పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేరనుందని సీఎం జగన్‌ అన్నారు. రాష్ట్రంలో ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లు(ఎంఐజీ)’లకు సంబంధించిన లేఅవుట్లు, వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ప్రతీ పేదవాడికి సొంతిల్లు ఉండాలని ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.  ఇప్పటికే 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. ఇప్పటికే పేదల ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు. మధ్యతరగతి ప్రజల సొంతింటి కల కోసం 150, 200, 240 చదరపు గజాల ప్లాట్లు ఎంచుకునే అవకాశం ఉందని తెలిపారు. తొలిదశలో ధర్మవరం, మంగళగిరి, రాయచోటి,  కందుకూరు, కావలి, ఏలూరులో ప్లాట్ల కేటాయింపు ఉంటుందని వివరించారు. 

ప్రతి నియోజకవర్గంలో జగనన్న టౌన్‌షిప్‌లు ఏర్పాటు సిద్ధం కానున్నాయని వెల్లడించారు. రూ.18 లక్షలకంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారికి మాత్రమే ఇళ్ల స్థలాల కేటాయింపు జరుగుతుందని సీఎం జగన్‌ తెలిపారు. https://migapdtcp.ap.gov.in/  వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. వెబ్‌సైట్‌ ద్వారా నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుందని సీఎం జగన్‌ తెలిపారు. అత్యంత పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. అన్ని చోట్లా పట్టణ ప్రణాళికా విభాగం నియమాల మేరకు లేఅవుట్లు సిద్ధం చేశామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లు, ధరలో 20 శాతం తగ్గింపు ఉంటుందని సీఎం జగన్ చెప్పారు. ప్లాట్ల ధరను నాలుగు వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, నాణ్యమైన మౌలిక సదుపాయాలు ఉంటాయని సీఎం చెప్పారు. వాణిజ్య సముదాయాలు, బ్యాంకులకు స్థలాల కేటాయింపు ఉంటుందని సీఎం జగన్‌ చెప్పారు.

కాగా, తొలి విడతలో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరు, అనంతపురం జిల్లా ధర్మవరం, ప్రకాశం జిల్లా కందుకూరు, వైఎస్సార్‌ కడప జిల్లా రాయచోటి, నెల్లూరు జిల్లాలోని కావలి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వద్ద లేఅవుట్లు సిద్ధం చేశారు. మొదటి విడతలో 3,894 ప్లాట్లను అన్ని వసతులతో సిద్ధం చేశారు. మార్కెట్‌ ధరకంటే ఈ ప్లాట్ల ధరలు తక్కువగానే నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. న్యాయపరమైన సమస్యలు లేని స్పష్టమైన టైటిల్‌ డీడ్‌తో ప్రభుత్వమే వేస్తున్న ఈ లే అవుట్లకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. పూర్తి పర్యావరణ హితంగా మొత్తం లే అవుట్‌లో 50 శాతం స్థలాన్ని మౌలిక వసతులు, సామాజిక అవసరాలకు కేటాయించారు. విశాలమైన 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, కలర్‌ టైల్స్‌తో ఫుట్‌పాత్‌లు, ఎవెన్యూ ప్లాంటేషన్, తాగునీటి సరఫరా, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజ్‌ వ్యవస్థ, వరద నీటి డ్రెయిన్లు, పూర్తి విద్యుదీకరణ, వీధి దీపాలు వంటి వసతులు కల్పిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement