కూనవరం – మూడు దశల్లో పోలవరం డ్యాంలో నీళ్లు నింపుతామని, ఒక్కసారిగా నింపితే డ్యామ్ కూలిపోవచ్చని అన్నారు ఎపి ముఖ్యమంత్రి జగన్. పోలవరం నీళ్లు నింపే విషయంలో సీడబ్ల్యూసీ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని చెప్పారు. పోలవరం నిర్మాణంలో, ముంపు బాధితులకు సాయం అందించడంలో తమ ప్రభుత్వం క్రెడిట్ కోసం ఆలోచించదని అన్నారు. ప్రజలకు న్యాయం జరగాలనేదే తమ సంకల్పం అని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కూనవరం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై కూనవరం, వీఆర్‌పురం మండలాల ప్రజలతో మాట్లాడుతూ.. వరద బాధితులకు సహాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. అధికారులు గ్రామాల్లోనే ఉండి.. వరద బాధితులకు నిత్యవసరాలు అందించారని పేర్కొన్నారు.
సహాయక చర్యల కోసం అధికారులకు తగిన సమయం ఇచ్చామని,నష్ట పరిహారం పక్కాగా అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. వరద బాధితులకు నిత్యవసరాలు అందించామని ఇళ్లు దెబ్బతిని ఉంటే రూ. 10 వేలు ఇవ్వాలని ఆదేశించామని చెప్పారు. ఇళ్లలోకి నీరు వచ్చినన వారికి రూ. 2 వేలు ఆర్థికసాయం చేశామని తెలిపారు. ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్నదే తమ తాపత్రయం అని అన్నారు. డబ్బులు మిగుల్చుకోవాలనే ఆరాటం మా ప్రభుత్వానికి లేదని అన్నారు. ఎవరికైనా వరద సాయం అందకుంటే ఇక్కడికి వచ్చి తనకు చెప్పాలని కోరారు.
పోలవరం ముంపు బాధితుల పునరావాస ప్యాకేజీ పారదర్శకంగా అమలు చేస్తామని అన్నారు. పోలవరం పునరావాస ప్యాకేజీకి ఈ నెలఖారు వరకల్లా కేంద్రం కేబినెట్ ఆమోదం తెలుపుతుందనే సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పోలవరం పరిహారం కేంద్రం స్వయంగా చెల్లించినా పర్వాలేదని, బాధితులకు రావాల్సిన ప్యాకేజ్‌పై మంచి జరుగుతుందని అన్నారు. ఆర్ అండ్ ఆర్ విషయంలో కేంద్రం నిధులకు తోడు రాష్ట్ర నిధులు అందిస్తామని అన్నారు. ప్రతి నిర్వాసిత కుటుంబానికి న్యాయపరమైన ప్యాకేజీ అందుతుంది అని పేర్కొన్నారు జగన్. ముంపు ప్రాతాల్లో లీడార్ సర్వే ద్వారా అందరికీ న్యాయం జరుగుతోందని చెప్పారు.