Friday, November 22, 2024

నంద్యాలలో విలేకరి దారుణ హత్య

కర్నూలు జిల్లా నంద్యాలలో యూట్యూబ్‌ ఛానల్‌ విలేకరి దారుణ హత్యకు గురైయ్యాడు. విలేకరి కేశవను గుర్తు తెలియని దుండగులు కత్తులతో దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నంద్యాలలోని ఎన్జీవో కాలనీలో చోటు చేసుకుంది. గుట్కా వ్యాపారులతో కానిస్టేబుల్‌ సంబంధాల ఆడియోను విలేకరి కేశవులు బయటపెట్టాడు. దీనిపై సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. ఈ విషయం తెలుసుకుని జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి కానిస్టేబుల్‌ సుబ్బయ్యను సస్పెండ్‌ చేశారు. దీంతో కేశవపై కానిస్టేబుల్ సుబ్బయ్య పగ పెంచుకుని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఆదివారం రాత్రి మాట్లాడాలని చెప్పి కేశవను ఎన్జీవోస్‌ కాలనీలోని ఆటోస్టాండ్‌ వద్దకు పిలిపించాడు. అక్కడ కేశవతో ప్రత్యేకంగా మాట్లాడాలని సుబ్బయ్య, అతడి తమ్ముడు నాని గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ కత్తితో పొడిచినట్లు తెలుస్తోంది. తీవ్రగాయాలతో ఉన్న కేశవను ఆటోలో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించాడు. అప్పటికే కేశవ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పదునైన ఆయుధంతో కేశవ వీపు వెనుకభాగంలో తీవ్రంగా పొడిచినట్లు వైద్యులు తెలిపారు. సుబ్బయ్యతో పాటు అతని తమ్ముడు నాని కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

కానిస్టేబుల్‌ అవినీతి వ్యాపారాన్ని బట్టబయలు చేసిన విలేకరిని హత్యచేయటం పట్ల జర్నలిస్ట్‌ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. కేశవ మృతదేహాన్ని డీఎస్పీ చిదానందరెడ్డి, తాలుకా సీఐ మురళిమోహన్‌రావు పరిశీలించారు. డీఎస్పీ మాట్లాడుతూ నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement