తెనాలిటౌన్, జూన్1 ప్రభ న్యూస్ యువకుడి దారుణ హత్యతో తెనాలిలో అలజడి నెలకొంది. కొద్ధి సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న పట్టణంలో సినీ ఫక్కీలో కత్తులతో యువకుడి వెంటపడి దారుణంగా నరికి చంపారు. పట్టపగలు నడిరోడ్డుపై ఓ రౌడీషీటర్‌ను కొందరు వ్యక్తులు దారుణంగా హతమార్చారు. పాతకక్షల నేపధ్యంలోనే ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే తెనాలి పాండురంగపేటకు చెందిన మత్తే ప్రశాంత్(30) గతంలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. సుమారు నాలుగేళ్ల క్రితం ప్రశాంత్ మరో 17 మంది కలిసి తెనాలి రైల్వేస్టేషన్ సమీపంలో బుడ్డా అనే ఓ యువకుడిని కొట్టి చంపారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేకెత్తించగా ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. తరచూ గొడవలకు పాల్పడే ప్రశాంత్ పై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ కూడా ఉంది. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే గత కొంత కాలంగా గుంటూరులోని ఓ ప్రైవేటు ఇన్సిట్యూషన్లో అటెండర్ గా పని చేస్తున్న ప్రశాంత్ అక్కడే ఉంటున్నాడు. మృతుని భార్య స్వస్ధలం భీమవరం కాగా అక్కడ ఓ శుభకార్యం ఉంటే వెళ్లి బుధవారం మధ్యాహ్నం తల్లిని చూసేందుకుని తెనాలి వచ్చాడు. అప్పటి నుండి స్నేహితులతో కలిసి మద్యం తాగుతూ తిరుగుతున్నాడు. మధ్యలో అమరావతిఫ్లాట్స్లో కొందరితో ఇతడికి ఘర్షణ కూడా జరిగినట్లు తెలుస్తోంది. రాత్రి 9 గంటల సమయంలో ప్రశాంత్ తల్లి ఫోన్ చేసిన సమయంలో చెంచుపేట వద్దే ఉన్నానని, కొద్దిసేపట్లో వస్తానని చెప్పినట్లు సమాచారం. అయితే ఇంతలో ఏం జరిగిందో తెలియదు కాని పాండురంగపేటలోని పద్మావతి కళ్యాణ మండపంకు వెళ్లే దారిలో మత్తే ప్రశాంత్ దారుణంగా హత్యకు గురయ్యాడు
ఉదయం 7.30 గంటల సమయంలో మాస్కులు ధరించి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ప్రశాంత్ ను కత్తులతో పొడిచి హత్యాయత్నం చేశారు. వారి నుండి పారిపోబోతుండగా వెంటపడి మరీ కత్తులతో నరికి చంపారు. తీవ్ర రక్తగాయాలతో ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు.
. సమాచారం అందుకున్న సిఐలు ఘటనాస్ధలానికి చేరకుని పరిశీలించారు. త్రీ టౌన్ సిఐ యు శ్రీనివాసులు, ఒన్‌టౌన్, టూ టౌన్, తాలూకా సిఐలు కె చంద్రశేఖర్, ఎస్ వెంకట్రావు, శ్రీనివాసరెడ్డి ఘటనాస్ధలంలో వివరాలు సేకరించి అనుమానితులను విచారించారు. కొద్దిసేపటికే డిఎస్పీ బి జనార్ధనరావు కూడా ఘటనాస్ధలానికి చేరుకుని హత్య గురించి ఆరా తీశారు. చుట్టుపక్కల ఉన్న సిసి కెమేరాలను పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు వచ్చి హత్యకు పాల్పడినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. మృతుడి తల్లి మత్తే జయలత ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా పట్టపగలు నడిరోడ్డుపై జరిగిన రౌడీషీటర్ హత్యోదంతం పట్టణంలో తీవ్ర కలకలం రేకెత్తించింది. గతంలోనూ పాతకక్షల నేపథ్యంలో కొన్ని దారుణ హత్యలు జరిగాయి. అధిపత్యపోరులో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని దారుణంగా హతమార్చారు. ఈ నేపథ్యంలో ఒక గ్యాంగ్ తుడిచిపెట్టుకుపోయింది. ఆ సమయంలోనూ పోలీసుల అలసత్వం వల్లనే హత్యలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా యువకుని హత్యతో మరో మారు పోలీసుల తీరుపై పలు ఆరోపణలు వెల్లువెతూతున్నాయి. ఇప్పటికైనా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టి రౌడీషీటర్లపై నిఘా ఉంచి నేరాలు అడ్డుకట్ట వేయాలని తెనాలి ప్రజలు కోరుతున్నారు.