కుప్పం, జనవరి 7(ఆంధ్రప్రభ) : అతను మా ఊరు వాడు అని ఒక నాయకుడు అనగానే చంద్రబాబు వద్ద చెప్పగానే… మా ఊరు.. మీ ఊరు అని విడదీయడం పద్దతి కాదు.. మీరు ఇలా ఓవర్ యాక్షన్ చేయడం వల్లే కుప్పం నియోజకవర్గంను చెడ్డగొట్టారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం తెదేపా కార్యాలయంలో జననాయకుడు కార్యక్రమం ప్రారంభోత్సవ సమయంలో హెల్ప్ డెస్క్ సిబ్బంది మా ఊరు అమ్మాయి అని చంద్రబాబుకు రూరల్ మండల పార్టీ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ పరిచయం చేయగానే ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలా మా ఊరు మీ ఊరు అనే విధానం వదలియండి.
ఆమె కార్యాలయ సిబ్బంది, ప్రజలందరికీ ఆమె సేవ చేసేందుకు పనిచేస్తుంది. ఆలా కాదు అంటే మీరు కూడా పార్టీ కార్యాలయానికి అనుమతి వుండదు. మీకు బాగా అలవాటు అయ్యింది.. మీరే అన్ని చేయాలి.. ఎవ్వరిని ప్రోత్సాహించకుండా ఇవ్వకుండా ఇష్టానుసారంగా చేస్తూ కుప్పం నియోజకవర్గాన్ని చెడ్డగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు అనే వారు స్వలాభం కోసం కాకుండా ప్రజలకు స్వచ్చమైన సేవ చేసేందుకు సంసిద్ధంగా ఉన్నవారే ముందుకు రావాలని తెలిపారు. జన నాయకుడు కార్యక్రమం కోసం పార్టీ కార్యాలయం కు వచ్చే వారందరికీ గౌరవం ఇచ్చి వారి సమస్యను సావధానంగా వినడంతో పాటు వారు ఇచ్చే అర్జీకి రసీదు ఇవ్వాలని తెలిపారు.
కుప్పం జన నాయకుడు పేరుతో నిర్వహించిన అర్జీల స్వీకరణలో 1090 సమస్యల అర్జీలు…
కుప్పం, జనవరి 7(ఆంధ్రప్రభ) : జననాయకుడు పేరుతో తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఆవరణ నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ ద్వారా అర్జీదారుల నుండి సమస్యల అర్జీలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వీకరించారు. రాష్ట్ర ముఖ్య మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోవసారి మూడు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఆవరణంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి ఉదయం 9 గంటల నుంచి అర్జీదారుల అర్జీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి 25కౌంటర్ల ద్వారా 1090 మంది అర్జీలు వ్రాయించుకొన్నారు.
కుప్పం నియోజకవర్గంతో పాటుగా జిల్లా వ్యాప్తంగా 1090 మంది అర్జీదారుల వివిధ రకాల సమస్యలతో నేరుగా ముఖ్యమంత్రికి అందజేయాలని ఉద్దేశంతో పెద్దఎత్తున అర్జీదారుల రావడంతో ముఖ్యమంత్రి స్వయంగా అర్జీదారుల వద్దకు వచ్చి సమస్యల అర్జీలను స్వీకరిస్తూ వారు చెప్పే సమస్యలను వింటూ వారి సమస్యలను వెంటనే పరిష్కారం చేయుటకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అర్జీదారులకు ముఖ్యమంత్రి చూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల నందు గత 10సంవత్సరాల నుండి అతిధి(గెస్ట్) అధ్యాపక జూనియర్ లెక్చరర్లు గా 1072 మంది పని చేయుచున్న తాము నెల నెలా తగిన జీతం అందకపోయినా ఎప్పుడో ఏడాదికి ఒక సారి జీతం పొందుతున్నప్పటికీ, ఎటువంటి ఉద్యోగ భద్రత అంటే జనరల్ ట్రాన్స్ ఫర్లు జరిగినా, లేదా ఎటువంటి రెగ్యులర్ జూనియర్ లెక్చరర్ల నియామకాలు చేపట్టినప్పటికీ ఎటువంటి ఉద్యోగ భద్రత లేకపోయినా ఎన్నో కష్ట నష్టాలు, ఆర్ధిక బాధలు ఓర్చుకొని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యాబోధన చేస్తూ ప్రభుత్వ జూనియర్ కాలేజీల మనుగడలో తమ వంతు కృషి చేస్తూ ఉన్నామన్నారు. తమపై దయతో తమకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలల (అతిధి) అధ్యాపకుల బృందం ముఖ్యమంత్రికి అర్జీని అందజేశారు. అర్జీదారులకు జిల్లా యంత్రాగం ఎలాంటి ఇబ్బంది కలగకుండా త్రాగునీరు, మజ్జిగ, కుర్చీలు, అన్నిరకాల మౌలిక సదుపాయాల కల్పించారు.
ముఖ్య మంత్రి ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న పి.ఎస్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్,ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీ కాంత్, అనంతపురం రేంజి డి ఐజి షిమేషి,జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు,కడ ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్, జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి,డిఎఫ్ ఓ.భరణి, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, కుప్పం, చిత్తూరు ఆర్డీఓ లు శ్రీనివాస్ రాజు,శ్రీనివాసులు,డి ఆర్డీఏ పిడి శ్రీదేవి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.