Saturday, November 23, 2024

Exclusive | అంధుడు కాదు.. త్రినేత్రుడు! యంగ్ గ్లోబల్ లీడర్

ఆంధ్రప్రభ స్మార్ట్ , విజయవాడ: కృష్ణాజిల్లా బందరు మండలం సీతారామపురం గ్రామమది. ముప్పై ఏళ్ల కిందట.. అది మరీ కుగ్రామం. ఈ ఊళ్లో సంపన్నులకే కరెంటు సదుపాయం. ఇక చదువనేది వారికి గొప్ప యోగం. ఆ ఊరికి వెళ్లాలంలటే చేల గట్లపై నడవాల్సిందే. అది నిజంగా పేదోళ్ల ఊరే. సరీగా ఆ ఊళ్లోనే ఓ మేనరికం జంటకు 1992 జులై 7న ఓ పండంటి బిడ్డ పుట్టాడు. అమ్మానాన్నకు ఏడుపే ఏడుపు.

ఎందకంటే, తమకు పుట్టిన బిడ్డ కళ్లు తెరవడు. పుట్టు గుడ్డోడు. ఏం చేయాలో తల్లిదండ్రులకు పాలుపోలేదు. ఆ ఊరిజనం ఒక అడుగు ముందుకేసి ఆ పిల్లోడిని ఎలా వదిలించుకోవాలో ఉచిత సలహాలు ఇచ్చారు. కానీ, అమ్మ నాన్న అలా చేయలేదు. ‘‘మేము బతికున్నంతవరకు బాగా చూసుకొంటాం. మేము పోయాక దేవుడే చూసుకోవాలి” అని అనేవారు.

కళ్లు కనపడకపోవడం తప్ప, బడిలో ఈ బుడ్డోడు బొల్లా శ్రీకాంత్ అందరికంటే చురుకుగా ఉండేవాడు. కానీ, ఇంటర్​లో ‘నీవు గుడ్డివాడివి కాబట్టి సీటు ఇవ్వలేం” అని కాలేజీలు తెగేసి చెప్పాయి. శ్రీకాంత్ కోర్టుకెళ్లాడు. గెలిచి అడ్మిషన్​ తెచ్చుకున్నాడు. తోటి పిల్లల ఎగతాళి భరించలేక చదువు మానేసి రెండేళ్లు ఇంట్లోనే ఉండిపోయాడు.

- Advertisement -

ఇక్కడే గేమ్ చేంజ్

చదువుపై మక్కువ ఆగలేదు. మరో ప్రయత్నంగా హైదరాబాద్​లో స్కూల్​ ఫర్​ స్పెషల్లీ ఏబుల్డ్​లో చేరాడు. అక్కడకూడా పిల్లల అవమానం తప్పలేదు. అందరూ తనను వదిలేసి వెళ్లిపోతుంటే బాధ తట్టుకోలేక బడివదిలేసి పారిపోతుంటే… ఒక టీచర్ పట్టుకొని చెంపచెళ్లుమనిపించింది. అది అతని జీవితంలో గేమ్ చేంజింగ్ మూవ్ మెంట్. ఆ టీచర్ ఆడియో టేపుల్లో పాఠాలు వినిపించింది. ఇంటర్​ ఎంపీసీలో చదివి 98శాతం మార్కులు సాధించాడు. అంతే .. ఎగతాళి చేసినోళ్లంతా అవాక్కయ్యారు. కానీ, ఐఐటీలోనూ పెను సవాల్ ఎదురైంది.

అయినా.. తప్పని సవాళ్లు

ఐఐటీ సంస్థలు బొల్లా శ్రీకాంత్​కు సీటు ఇవ్వలేమని చెప్పాయి. నిరాశపడని శ్రీకాంత్ అమెరికా యూనివర్సిటీల్లో ఎంట్రన్ప్ ఎగ్జామ్ రాస్తే స్టాన్ ఫోర్డ్ సహా మరో రెండు యూనివర్సిటీలు అడ్మిషన్లకు ముందుకొచ్చాయి. శ్రీకాంత్ మాత్రం హోవార్డ్ మస్సాచసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (అమెరికా) బ్రెయిన్ కాగ్నిటివ్ సైన్సెస్ చేరిన తొలి అంధుడిగా రికార్డు సృష్టించాడు.

అతని ప్రతిభ చూసి, చదువు అయ్యాక నాలుగు అమెరికన్ కంపెనీలు తమదగ్గర ఉద్యోగం చేయాలని కోరాయి. అయితే.. శ్రీకాంత్ వారి రిక్వెస్ట్​ని సున్నితంగా ‘లేదు’ అని చెప్పాడు. భారతదేశం చేరుకొని తనతోటి నిరుపేద, దివ్యాంగ భారతీయులకు సహాయపడే భాగ్యాన్ని నాకు ఇవ్వు అని అతను భగవంతుడిని ప్రతి రాత్రీ ప్రార్థించాడు. ఇక.. అప్పటికి కానీ ఫలితం కనిపించింది.

ఇక తిరుగులేని కెరీర్…

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్థాపించిన లీడ్ ఇండియా ప్రోగ్రామ్​లో 2005లో చేరాడు. యువ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాడు. నిరుద్యోగం, దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ఓ మార్గాన్ని చూపాడు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో కలిసి 8 లక్షల యువకులకు పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగాడు.

2011లో బహుళ సమస్యలతో తల్లడిల్లుతున్న దివ్యాంగుల కోసం హైదరాబాద్​లో సమన్వయి సెంటర్ ప్రారంభించారు. ఎవరైతే విద్య, వృత్తి, ఆర్థిక, పునరావస సమస్యలు ఎదుర్కొంటున్నారో? ఆ దివ్యాంగులకు బాసటగా నిలిచారు. ఇక.. హైదరాబాద్​లో పర్యావరణ హిత పేపర్ ప్రొడక్టిక్ కంపెనీ ప్రాంభించాలని శ్రీకాంత్ భావించారు.

అందుకు మెంటార్​గా తక్కిలిపాటి స్వర్ణలత, ఇన్వెస్టర్​గా మంత్రి రవి భాగస్వామ్యంతో ₹10లక్షల పెట్టుబడితో బొలాంట్ ఇండస్ర్టీస్ పురుడు పోసుకుంది. ఆ కంపెనీ ఇప్పుడు ₹500 కోట్ల కుట చేరింది. ప్రస్తుత వార్షిక టర్నోవర్ ₹150 కోట్లకు చేరింది.

ఈ సంస్థకు సీఈవో బొల్లా శ్రీకాంత్. ప్రస్తుతం 500 మంది దివ్యాంగులు ప్రత్యక్షంగా… 2500 మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. 4000 మందికి ఉచిత విద్యను అందిస్తున్నారు. ఇక.. 2022లో వీర స్వాతిని వివాహం చేసుకున్నారు. వీరికి ఓ ఆడబిడ్డ పుట్టింది. ఆమె పేరు నయన (కళ్లు) గా నామకరణం చేశారు.

శ్రీకాంతుడి వెలుగులు..

2012లోనే మాజీ రాష్ట్రపతి చేతుల మీదుగా బెస్ట్ యూత్ లీడర్ అవార్డును శ్రీకాంత్ అందుకున్నారు. 2021లోనే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఆధీనంలోని జేసీఐలో తొలి పది మంది మోస్ట్ ఔట్ స్టాండింగ్ యంగ్ పర్సన్స్ లో ఒకరిగా.. గ్లోబల్ యంగ్ లీడర్ గా శ్రీకాంత్ కు స్థానం దక్కింది.

ప్రతిభ ఎక్స్ లెంట్ అవార్డుతో ఏపీ ప్రభుత్వం గౌరవించింది. 2018 రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగా గుర్తించి పురస్కారం అందజేసింది. 2017లో ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన ఆసియాలో 30 అగ్రగామి సంస్థల్లో బొల్లాట్ ఇండస్ర్టీకి స్థానం లభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement