ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ NTR బీచ్ లో ఇవ్వాల ఓ యువతి కిడ్నాప్ అయ్యింది. కారులో యువతిని కిడ్నాప్ చేసి తీసుకుని పోతున్నట్లు డయల్ 100 కాల్ వచ్చింది. ఈ విషయం తొలుత కాకినాడ పోలీస్ కంట్రోల్ రూమ్ కు చేరింది. దీంతో స్పందించిన పోలీసులు హుటాహుటిన నిమిషాల వ్యవధిలోనే సంఘటనా స్థలానికి చేరుకొని కారును ఆపేసి తనిఖీలు నిర్వహించారు.
సోమవారం సాయంత్రం కాకినాడ NTR బీచ్ లో ఒక అమ్మాయిని క్రెటా కారులో కిడ్నాప్ చేసి తీసుకుపోతున్నట్టు భావించిన కొంతమంది డయల్ 100కు కాల్ చేశారు. ఆ యువతి హెల్ప్ హెల్ప్ అని అరవడమే దీనికి కారణం. అయితే కాకినాడ పోలీస్ కంట్రోల్ రూం పోలీసులు తిమ్మాపురం పోలీసులకు సమాచారాన్ని అందించారు. దీంతో రంగంలోకి దిగిన తిమ్మాపురం పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని కొత్తూరు జంక్షన్ వద్ద కారును ఆపేశారు.
కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని వివరాలు సేకరించగా ఆ యువకుడు, యువతి భార్యా భర్తలుగా తెలిసింది. కాకినాడ బీచ్ చూడ్డానికి వచ్చారని, వారి మధ్య ఏర్పడ్డ చిన్నపాటి మనస్పర్థల వల్లే ఆ యువతి అలా అరిచినట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో వారి తల్లిదండ్రుల ద్వారా ధ్రువీకరించుకుని కౌన్సెలింగ్ నిర్వహించి సురక్షితంగా పంపించారు. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే తక్షణమే స్పందించి ఫోన్ కాల్స్ ను సమన్వయం చేసిన కాకినాడ కంట్రోల్ రూం పోలీసులకు, సంఘటనా స్థలానికి చేరుకుని విధి నిర్వహణలో అంకితభావం కనబరిచిన తిమ్మాపురం పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ M.రవీంద్రనాథ్ బాబు అభినందించారు.