పొన్నలూరు, (ప్రభ న్యూస్) : అప్పుల బాధ తాళలేక యువరైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పొన్నలూరు మండలంలోని పెరికపాలెంలో ఈఘటన జరిగింది. నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న రైతుల దీనస్థితికి మరొక ఉదాహరణగా ఈ సంఘటనను చెప్పుకోవచ్చు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంకు వెంకటేశ్వర్లు (34) అనే రైతు కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. స్థానికంగా వ్యవసాయం చేసుకుంటూ అదే విధంగా కర్ణాటక రాష్ట్రంలోనూ ఆంజీరా సాగును చేపట్టాడు. అందులోనూ లాభాలు రాకపోగా తీవ్ర నష్టాలను మిగిల్చింది. ఈ క్రమంలో అనేక సంవత్సరాలుగా నష్టాలు రావడంతో భారీ మొత్తంలో అప్పుల పాలయ్యాడు.
అప్పులు పెరిగిపోవడం, అప్పు ఇచ్చిన వారు తిరిగి అడుగుతుండటంతో ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో తన చావుకు కారణాలు తెలుపుతూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుమందు తాగాడు. విషయం తెలుసుకున్న బంధువులు కందుకూరులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా… చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మరణించాడు. మృతునికి భార్య, చిన్న వయసు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో పెరికపాలెం గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి. రైతు ఆత్మహత్య చేసుకున్న సెల్ఫీ వీడియోను సామాజిక మాధ్యమాలలో చూసిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు మృతదేహానికి శవపంచనామా నిర్వహించి బంధువులకు అప్పజెప్పామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..