Saturday, November 9, 2024

కోర్టు స్టేలతో ప్రాజెక్టులు అడ్డుకునే మీరు.. సీమ అభివృద్ధి ఎలా చేస్తారు : చంద్రబాబు కు పెద్దిరెడ్డి సూటి ప్రశ్న

పుంగనూరు (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : స్వంత జిల్లాకు మేలు చేసే నీటి ప్రాజెక్ట్ లను కోర్టు స్టేలతో అడ్డుకుంటున్న చంద్రబాబు రాయలసీమను అభివృద్ధి చేస్తానంటే ఎలా నమ్మాలని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. ఈరోజు పుంగనూరు మున్సిపాలిటీలో చేపట్టిన వార్డు బాట కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమయంలో జలయజ్ఞం ద్వారా యుద్ధప్రాతిపదికన పనులు సాగాయని, అదే తరహాలో నేడు సిఎం వైఎస్ జగన్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారన్నారు.


సిఎం జగన్ పులివెందుల నియోజకవర్గం నుండి ఈ ప్రాంతానికి నీరు ఇవ్వాలని నిర్ణయిస్తే సొంత నియోజకవర్గమైన కుప్పంకు కూడా నీరు ఇవ్వలేని స్థితిలో 14 ఏళ్ల పాటు సీఎంగా చేసిన చంద్రబాబు ఉన్నారన్నారు. ఈ ప్రాంతంలో మూడు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉంటే వాటికి తన బంధువులను కోర్టుకు పంపి స్టే తెచ్చిన చంద్రబాబు చిత్తూరు జిల్లాకు అభివృద్ధి నిరోధకుడిగా నిలిచారని విమర్శించారు. కళ్లు ఉండి కూడా అభివృద్ధి చూడలేని చంద్రబాబు రాయలసీమ ను ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు.

ఆయన మాటలు జిల్లా ప్రజలే కాదు రాయలసీమ వాసులెవరూ నమ్మరని, వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. మొత్తం ఐదు రోజుల పాటు పట్టణంలోని అన్ని వార్డుల్లో పర్యటించనున్న ఆయన ముందుగా హనుమంతుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలోని ఆరు వార్డుల్లో పర్యటించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలు ఆర్వో ప్లాంటులు, సిసి రోడ్లను ప్రారంభించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement