న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : స్థాపించిన అనతికాలంలోనే లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా వెలుగొందిన తెలుగుదేశం పార్టీ విధానాలు దేశానికే తలమానికాలయ్యాయని, సంక్షేమంతో ప్రగతి విధానాలకు బాటలు వేశాయని, అలాంటి టీడీపీ గురించి మాట్లాడే నైతిక హక్కు వైఎస్సార్సీపీ నేతలకు ఏమాత్రం లేదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ తేల్చి చెప్పారు. స్వార్ధ ప్రయోజనాలు,అరాచకత్వ పాలన, విధ్వంసకర వ్యూహాలు, సామాజిక విచ్ఛిన్నత, వ్యక్తిగత ద్వేషాలతో కూడిన పాలనందిస్తున్నజగన్ పార్టీ ఇకనైనా కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రజల భవితకు కృషి చేయాలని సూచించారు.
ఒక్క ఛాన్స్ ఇవ్వండని ప్రాధేయపడి అబద్దపు పునాదులపై అధికారం పొంది రాష్ట్రాన్ని అథోగతి పాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. రెండున్నరేళ్లుగా రాష్ట్ర రాజధాని నిర్మాణం గురించి ఆలోచించకుండా, రాష్ట్రానికి రాజధాని అనే కనీస చిరునామా కూడా లేకుండా చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదని దుయ్యబట్టారు. అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ నేతలు టీడీపీపై చేస్తున్న వ్యాఖ్యలు వారి భయాందోళనలకు అద్దం పడుతున్నాయని కనకమేడల చెప్పుకొచ్చారు. అభద్రతకు గురైన ముఖ్యమంత్రి, ఆయన భజన బృందం తమపై అవాకులు, చవాకులు పేలుతున్నారని ఆరోపించారు.