Monday, November 18, 2024

బూతు మాటలు, బుకాయింపులతో తప్పించుకోలేరు.. క్యాసినోపై సీఎం జగన్ నోరు విప్పాలి: టీడీపీ

గుడివాడలో క్యాసినో నిర్వహించిన విషయంలో మంత్రి కొడాలి నాని అడ్డంగా దొరికిపోయారని టీడీపీ అభిప్రాయ పడింది. వీడియోలతో సహా మొత్తం ఆధారాలు దొరికినా మంత్రి కొడాలి నాని బుకాయించే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ నేతలు అన్నారు. ఈ విషయంపై సీఎం జగన్ నోరు విప్పాలని టీడీపీ స్ట్రాటజీ కమిటీ డిమాండ్ చేసింది. గుడివాడ క్యాసినో అంశంలో టీడీపీ నేతలు చేసిన పోరాటాన్ని పార్టీ అధినేత చంద్రబాబు ప్రశంసించారు. స్వాతంత్ర్య సమరయోధులు, మేధావులు, ప్రముఖులు జన్మించిన గుడివాడను కాసుల కోసం కక్కుర్తి పడి క్యాసినో క్యాపిటల్ గా కొడాలి నాని మారుస్తున్నారని మండిపడ్డారు. నిజ నిర్థారణకు వెళ్లిన టీడీపీ నేతలపై దౌర్జన్యం చేయడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.

కాగా, క్యాసినో వంటి విష సంస్కృతిపై  పోరాటం కంటిన్యూ చెయ్యాలని స్ట్రాటజీ కమిటీ డిసిషన్ తీసుకుంది. వందల కోట్లు చేతులు మారిన ఈ వ్యవహారంలో వివిధ జాతీయ ఏజెన్సీలకు, దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చెయ్యాలని నేతలు నిర్ణయం తీసుకున్నారు. వైసీసీ నేతల కనుసన్నల్లో స్వయంగా మంత్రికి చెందిన కన్వెన్షన్ సెంటర్ లో గ్యాంబ్లింగ్ ఆడిన వీడియోలపై సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు. కేవలం మంత్రి కొడాలి తన బూతు మాటలు, ఎదురు దాడితో జరిగిన తప్పులను కప్పిపుచ్చలేరని పలువురు నేతలు అన్నారు.

చిత్తూరు జిల్లాలో దళిత మహిళను పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడాన్ని ఈ భేటీలో నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ దారుణ ఘటనలో కేవలం సదరు పోలీసును సస్పెండ్ చేస్తే సరిపోదని, బాధ్యులపై అట్రాసిటీ కేసుల పెట్టి విచారణ చెయ్యాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే చిత్తూరులో ఇలాంటివి 4  ఘటనలు జరిగాయని నేతలు వెల్లడించారు.

ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచకపోగా, వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్న విధానాలపైనా సమావేశంలో చర్చ జరిగింది. ఉద్యోగులపై సోషల్ మీడియాలో, మీడియాలో ప్రభుత్వమే తప్పుడు ప్రచారం చేయించడం ప్రభుత్వ నైజాన్ని తెలుపుతుందన్నారు. ఉద్యోగుల డిమాండ్లకు సమావేశం మద్దతు తెలిపింది. ఇంకా పలు అంశాలపై తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భవిష్యత్ పోరాటాలకు వీటిని వేదికగా చేసుకోవాలని అభిప్రాయపడింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్, కె.అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement