Tuesday, November 26, 2024

కర్నూలు గోదా గోకులాన్ని సందర్శించిన యోగానందేశ్వర సరస్వతి

కర్నాటక యోగానందేశ్వర సరస్వతీ మఠాధీశులు, పూజ్యశ్రీ శంకర భారతీ స్వామీజీ,  ఆంధ్ర రాష్ట్ర ధర్మప్రచార యాత్రలో భాగంగా కర్నూలు నగర శివారులో వెలసిన గోదా గోకులాన్ని సందర్శించి, భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. స్వామీజీ కన్నడ ప్రసంగానికి  చంద్రశేఖర కల్కూర తెలుగు అనువాదం చేశారు. సమాజాన్ని సరైన మార్గంలో నడిపించేది ఆధ్యాత్మిక శక్తేనని అటువంటి శక్తిని అందరూ సముపార్జించుకుని, దేశ ఐక్యతకు, ప్రగతికి పాటుపడాలని పిలుపునిచ్చారు. స్వయంగా భగవానుడే ఈ నేలపై వివిధ పేర్లతో, వివిధ రూపాలతో నడయాడి, సమాజానికి సరైన దిశా నిర్దేశం చేసి అవతార లక్ష్యాన్ని పూర్తిచేసుకుని మానవజాతికి వెలుగు బాటలు చూపిస్తూ ఉంటారని అటువంటి వారిలో ఆదిశంకరాచార్యులు ఒకరని స్వామీజీ అన్నారు. వారు రచించిన సౌందర్యలహరిపై సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. భక్తులందరికీ సౌందర్యలహరిని సామూహిక పారాయణం చేయించారు.

ఈ కార్యక్రమంలో అఖిల భారత గోదా విష్ణుసహస్రనామ పారాయణ పరివార్ వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజు గుప్తా, పల్లెర్ల నాగరాజు,బాల సుధాకర్,తల్లం తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డితో పాటు వివిధ ధార్మిక సంస్ధల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామీజీ పర్యటనకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement