Saturday, November 23, 2024

మా సంగ‌తేంటి…వైసిపి అధిష్టానాన్నినిల‌దీస్తున్న‌గ్రామాల నేత‌లు

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: వైసీపీని అధికారంలోకి తీసుకురావ డంలో క్షేత్రస్థాయిలో కీలక పాత్ర పోషించిన గ్రామ స్థాయి నాయకులకు సొంత పార్టీలోనే అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి. స్థానికంగా బలమైన నాయకులుగా పేరున్న మండల స్థాయిలో అధికారుల నుంచి సొంత గ్రామానికి అవసరమైన చిన్న పనిని కూడా చేయించుకోలేక సతమతమవుతున్నారు. పార్టీ పదవులతో పాటు ప్రజా ప్రతినిధులుగా బాధ్యత కలిగిన హోదాలో ఉన్న ముఖ్య నాయకులు సైతం కార్యకర్తలు అడిగిన పనులను చేసి పెట్టలేక నలిగిపోతున్నారు. అందుకు బలమైన కారణాలు కూడా లేకపోలేదు. నియోజకవర్గ పరిధిలోని ఏ ప్రాంతంలో ఏ శాఖ పరిధిలోనైనా చిన్న పని కావాలంటే స్థానిక ఎమ్మెల్యే చెప్పనిదే అధికారులు చేయడం లేదు. ఇదేమని మండల స్థాయి నాయకులు అధికారులను ప్రశ్నిస్తే.. ఎమ్మెల్యేలు చెప్పనిదే ఏ పని చేయవద్దని ఆదేశాలు ఇచ్చారని, మీరు వెళ్లి వారితో ఫోన్‌ కాల్‌ చేయించండి చాలు అంటూ అధికార పార్టీ నేతలను కూడా చూడకుండా చులకనగా చూస్తున్నారు. దీంతో కొంతమంది నేతలు అవమానం భరించలేక ఆయా మండలాల్లో తహసీల్దార్‌, ఎంపీడీవో, పోలీస్‌ స్టేషన్‌, అగ్రికల్చర్‌, పంచాయతీరాజ్‌, హౌసింగ్‌ కార్యాలయాలకు వెళ్లడమే మానేస్తున్నారు. సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఆయా ప్రాంతాలకు చెందిన స్థానిక నేతలు అధికారులకు చెబితే ఆ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతుంటారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా గ్రామస్థాయిలో చిన్నచిన్న పనులకు కూడా ఎమ్మెల్యేలకు ఫోన్‌చేసి మండల స్థాయి అధికారులకు సిఫారసు చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. గడిచిన నాలుగు సంవత్సరాలుగా అధికారం చేతులో ఉన్నా.. జగన్‌ను సీఎంగా చూడాలన్న పట్టుదలతో జెండా మోసిన నిజమైన పార్టీ విధేయులు సైతం సొంత మనుషులకు ఏదైనా సమస్య వస్తే పరిష్కరించుకోలేక విధిలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యే లను ఆశ్రయించాల్సి వసున్నది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితులు దర్శన మిస్తుండడంతో గ్రామస్థాయి నాయకులు పవర్‌లో ఉన్నా .. తమ చేతికి ఎటువంటి పవర్‌ లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మాట వినరు .. పనిచేయరు
గ్రామస్థాయిలో అనేక సమస్యలతో ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని , తక్షణమే ఆయా ప్రాంతాలకు వచ్చి పరిశీలించి సమస్యకు పరిష్కారం చూపాలని స్థానిక నేతలు మండల స్థాయి అధికారులకు నిత్యం తమ గోడును వెళ్ల బుచ్చుకుంటున్నారు. అయినా అధికారులు వారి మాట వినరు .. పని చేయరు. అదేమని నిలదీస్తే ఎమ్మెల్యేల పేరు చెప్పుకుని తప్పించుకుంటున్నారు. వాస్తవా నికి అన్ని నియోజకవర్గాల్లో ఇటువంటి పరిస్థితే కనిపిస్తున్నది. ఎమ్మెల్యేలకు తెలియకుండా స్థానిక నేతలకు పనులు చేస్తే నియోజకవర్గ పరిధిలో తమ పట్టు ఎక్కడ కోల్పోతామన్న ముందుచూపుతో ఎమ్మెల్యేలు కొంతమంది అధికారులకు ఆ దిశగా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఫలితంగానే రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ సమస్యలు ఎక్కడే పేరుకుపోతున్నాయి. కొన్ని గ్రామాల్లో అయితే నెలల తరబడి సమస్య పరిష్కారం కాక ప్రభుత్వాన్ని తిట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement