Tuesday, November 26, 2024

YCP vs TDP- జంప్ జిలానీల‌పై వేటు…అనర్హత కోసం పోటాపోటీ


(ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) – ఇంకా ఎన్నికల నగరా మోగలేదు. ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు, ఎత్తులు, జిత్తులతో జనానికి వినోదం పంచుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్​కు పాల్పడిన నలుగురిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ అధిష్టానం శాసన సభాపతికి విజ్ఞప్తి చేయగా.. తాము మాత్రం తగ్గేదే లేదంటూ టీడీపీ కూడా ఇదే పాచిక వేస్తోంది. నిజానికి చట్టాన్ని ఉల్లంఘించిన ఈ ఎనిమిది మందిపై అనర్హత వేటు కోసం కొంత కాలం యత్నించని అధికార, ప్రతిపక్ష పార్టీలో ఒక్కసారిగా చట్టంపై ప్రేమ పుట్టుకొచ్చింది.

జంప్​ జిలానీలపై వేటు..
ఇటీవలటీడీపీ గోడ దూకిన నలుగురు జంప్ జిలానీలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను వైసీపీ అధిష్టానం కోరిన కొన్ని గంటల్లోనూ వైసీపీ శిబిరంలో రెస్టు తీసుకొంటున్న నలుగురు తమ పార్టీ ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని టీడీపీ గగ్గోలు పెడుతోంది. ఈ మేరకు సభాపతికి ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయించింది. వైసీపీ గోడ దూకిన టీడీపీ కోటలో చేరిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి,ఉండవల్లి శ్రీదేవిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కి వైసీపీ ఫిర్యాదు చేయగా.. ఇక టీడీపీ గుమ్మం దాటి వైసీపీ ఇంట్లో కాపురం పెట్టిన కరణం బలరామ కృష్ణమూర్తి, వల్లభనేని వంశీ మోహన్, మద్దాల గిరి, వాసుపల్లి గణేష్ కుమార్ పై వేటు వేయాలని టీడీపీ ఘర్జిస్తోంది.

ఆ నలుగురి సంగతేంది?
ఇది సరే నాలుగేళ్ల కిందటే ఆ నలుగురూ టీడీపీ నుంచి వైసీపీ వైపుగా నడచారు. ఆరోజున టీడీపీఎలాంటి ఫిర్యాదూ చేయలేదు. ఒకవేళ అప్పుడే టీడీపీ పిర్యాదు చేస్తే ఆ నలుగురు పై వేటు పడేది. కానీ అప్పట్లోఅధికారంలో వైసీపీ బలంగా ఉంది. ఈ స్థితిలో ఉప ఎన్నికలు జరిగితే తట్టుకోవటం కష్టం కాబట్టే టీడీపీ వెక్కి వెక్కి ఏడ్చింది. ఎందుకొచ్చిన ఎన్నికల తంటా అని భావించించే టీడీపీ వ్యూహాత్మకంగానే ఆ ఊసును మర్చిపోయింది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధికి వైసీపీ ఎమ్మెల్యేలు ఓటు వేశారు . అందుకే ఆ నలుగురు ఎమ్మెల్యేల మీద వైసీపీ అనర్హత వేటు కోరుతోంది.ఈ నలుగురు కూడా గత ఏడాది మార్చినే విప్ ను ఉల్లంఘించారు. ఏడాదిగా వీళ్ల అనర్హత అధికార పార్టీకి ఎందుకు గుర్తురాలేదో? మరి అపుడే ఎందుకు చర్యలకు దిగలేదో అనేవి జనం ప్రశ్నలు.

ఉప ఎన్నిక‌ల‌కు భ‌య‌ప‌డ్డారా?
అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికలకు భయపడి వదిలేశారా? అనే చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతం ఆ నలుగురూ ఈ నలుగురూ ఎవరైనా సరే ఎమ్మెల్యేలుగా మూడు నెలలో ఉంటారు. ఉప ఎన్నికలు వచ్చే అవకాశమే లేదు. సాధారణ ఎన్నికలే పలుకరిస్తున్నాయి. ఈ స్థితిలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎత్తులు పై ఎత్తులతో ఈ అనర్హత వేటు అంశాన్ని తెరమీదకు తెచ్చారా అన్నది ఒక చర్చ. ఇందులో మరో మతలబు ఉంది. వైసీపీ నలుగురి ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేస్తే రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసినా ఆ నంబర్ తగ్గుతుంది. ఈ విషయాన్ని గ్రహించిన టీడీపీ కూడా తమ ఎమ్మెల్యేలపైనా ఈ ఫిర్యాదు చేసి.. అధికార పార్టీకీ నాలుగు ఓట్లు తగ్గించాలనే ఈ వ్యూహాన్ని అమలు చేసినట్టు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement