తాడేపల్లి: కేంద్ర మంత్రి అమిత్‌షా వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అభ్యంతరం తెలిపారు. నిన్న విశాఖ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వంపై అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. టీడీపీ నేతలు చెప్పిన మాటలనే అమిత్‌షా మాట్లాడారని పేర్కొన్నారు.
తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ, నిన్న కేంద్ర మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలన్నీ అవాస్తవాలే అన్నారు…బీజేపీ వాళ్లే మిమ్మల్ని అభాసుపాలు చేశారు. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. నిన్నటి సభలో విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్‌పై అమిత్‌షా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. టీడీపీ నేతలు చెప్పిన మాటలనే అమిత్‌షా మాట్లాడారని తెలిపారు. గతంలో చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రధాని నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా విమర్శించలేదా? అని గుర్తు చేశారు. అమిత్‌షా తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు టీడీపీ నేతలు రాళ్లతో దాడి చేయించలేదా? అని ప్రశ్నించారు.
నిన్న బీజేపీ సభా వేదికపై ఉన్నవారంతా ఎవరు?..టీడీపీ వారు కాదా? టీడీపీ హయాంలో జరిగిన కుంభకోణంపై బీజేపీ నేతలు ఎప్పుడైనా మాట్లాడారా? అని నిలదీశారు. టీడీపీ చెప్పుడు మాటలనే అమిత్‌షా వ్యాఖ్యానించారని చెప్పారు. ఎవరో ఏదో చెబితే మాట్లాడేసి వెళ్లిపోవడం సరికాదని పేర్కొన్నారు. టీడీపీ పచ్చి అబద్ధాలతో రాజకీయ పబ్బం గడుపుకుంటుందని విమర్శించారు. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా సీఎం వైయస్ జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా సీఎం వైయస్ జగన్ పరిపాలన సాగిస్తున్నారని స్పష్టం చేశారు. అవాస్తవాలు మానుకోవాలని మంత్రి హితవు పలికారు.