Thursday, November 21, 2024

ఫ్యాన్ … దుమారం..

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యహారం ఇటు ప్రభుత్వాన్ని అటు అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ప్రత్యేకించి నెల్లూరు వైకాపాలో రోజుకో ముసలం బయటపడు తుండటంపై వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేస్తూ సింహపురిలో చోటుచేసుకుం టున్న సంఘటనలను సీరియస్‌గా తీసుకున్నారు. ఢిల్లిd నుండి తాడేపల్లికి చేరుకున్న ఆయన బుధవారం నష్ట నివారణా చర్యలకు ఉపక్రమించారు. ముఖ్య నేతలతోపాటు హోం శాఖ కార్యదర్శి, ఇంటిలిజెన్స్‌ డీజీతో సమావేశమయ్యారు. ట్యాపింగ్‌ వ్యవహారం పై లోతుగా చర్చించారు. పార్టీలో గందరగోళ పరిస్థితులకు దారి తీస్తున్న ఈ వ్యవహారానికి ఎలా ఫుల్‌స్టాప్‌ పెట్టాలనే అంశంపై దృష్టి సారించారు. అయితే, ఎమ్మెల్యే కోటంరెడ్డి తన ఫోన్‌తో పాటు మరో 35 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు, ఇద్దరు మంత్రులు తమ ఫోన్లు ట్యాపింగ్‌ జరుగుతున్నాయని తనకు చెప్పారంటూ బాంబు పేల్చారు. ఈ వ్యవహారంపై కూడా సీఎం జగన్‌ సీరియస్‌ అయ్యారు. ప్రతిపక్ష పార్టీలకు ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం అస్త్రంగా మారకముందే నిగ్గు తేల్చాలని నిర్ణయం తీసుకున్నారు. కోటంరెడ్డి సోదరులు పార్టీని వీడే క్రమంలో నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో వైసీపీకి నష్టం జరగకుండా ఉండేలా వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకోబోతున్నారు. అందుకోసం జిల్లాకు సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలను తాడేపల్లికి పిలిచి వారితోకూడా సమావేశమయ్యారు. మొత్తానికి రూరల్‌ నియోజకవర్గంపై సీఎం జగన్‌ ప్రత్యేక దృష్టి సారించారు.

రంగంలోకి దిగిన సీఎం జగన్‌ :
నెల్లూరు వైకాపాలో వరుసగా చోటుచేసుకుంటున్న సంఘటనలతో సీఎం జగన్‌ స్వయంగా నెల్లూరు వ్యవహారంపై రంగంలోకి దిగారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి సంచలన ప్రకటన చేసిన రోజు ఈ వ్యవహారంపై చర్చించాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డికి సూచించారు. దీంతో సోమవారం నెల్లూరుకు చెందిన ముఖ్య నేతలతోపాటు రాష్ట్ర సేవాదళ్‌ అధ్యక్షులు కోటంరెడ్డి గిరిధర్‌ రెడ్డితో సజ్జల చర్చలు జరిపారు. అదేరోజు నెల్లూరు కేంద్ర సహకార బ్యాంకు మాజీ ఛైర్మన్‌ ఆనం విజయ్‌ కుమార్‌ రెడ్డితోనూ రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. అయితే, ఆరోజు పూర్తిస్థాయిలో చర్చలు జరగకపోవడంతో మంగళవారం పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ బాలినేని శ్రీనివాసుల రెడ్డిని నెల్లూరుకు పంపారు. రెండు రోజులపాటు అక్కడే మకాం వేసిన బాలినేని మంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడురాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, మాజీ మంత్రి పోలుబోయిన అనీల్‌ కుమార్‌ యాదవ్‌తో సమావేశమై ఫోన్‌ ట్యాపింగ్‌వ్యవహారాన్ని సర్దుబాటుచేసే ప్రయత్నం చేశారు. అయితే, అవి ఫలించలేదు. దీంతో బుధవారం ఎమ్మెల్యే కోటంరెడ్డి వీడియా ముందు ట్యాపింగ్‌ సాక్ష్యాలను బయటపెట్టారు. దీంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం కనిపిస్తుండటంతో స్వయంగా సీఎం జగన్‌ రంగంలోకి దిగారు.

ఆ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరు ?
నెల్లూరు ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎం జగన్‌ ఆదిశగా నెల్లూరు గ్రామీణ నియోజకవర్గానికి బలమైన ఇన్‌ఛార్జిలతో చికిత్స చేయాలని యోచిస్తున్నారు. ఆదిశగా చర్చలు జరిపి నిర్ణయం తీసుకోబోయే లోపే ఎమ్మెల్యే కోటంరెడ్డి బుధవారం మరో ఆటం బాంబు పేల్చారు. తనతోపాటు మరో 35 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు, నలుగురు ఎంపీల ఫోన్లు కూడా ట్యాపింగ్‌ జరుగుతున్నాయని, వారంతా తనకు గత మూడు రోజులుగా ఫోన్‌ చేసి చెబుతున్నారని సంచలన ప్రకటన చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కోటంరెడ్డి ప్రకటన హాట్‌ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా వైకాపాలో గందరగోళ పరిస్థితులను తీసుకొచ్చింది. ఎవరా 35 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు అంటూ రాష్ట్రవ్యాప్తంగా అధికారపార్టీ నేతల్లో కొత్త చర్చ మొదలైంది.
తెరపైకి మేకపాటి :
మొన్న ఆనం, నిన్న కోటంరెడ్డి వ్యవహారం మరవకముందే పార్టీలో వివాదం సర్దుబాటుకాకముందే నెల్లూరు పార్టీలో మరో ముసలం బయట పడింది. ఉదయగిరి శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి నియోజకవర్గ పరిశీలకుడు మెట్టుకూరు ధనుంజయరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నియమించిన పరిశీలకుడు ఉదయగిరిలో పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, వ్యక్తిగతంగా తనను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని మేకపాటి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంలో అధిష్టానానికి ఫిర్యాదుచేస్తానని ప్రకటన చేయడంతోపాటు ఆయనపై అవసరమైతే యుద్ధంచేస్తానంటూ హెచ్చరించడాన్నిబట్టి చూస్తుంటే మేకపాటి కూడా ఆనం, కోటంరెడ్డి తరహాలోనే అధిష్టానంపై తిరుగుబాటుకు సిద్ధమౌతున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నెల్లూరు వైకాపాలో ముసలం ముదురుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా నెల్లూరు టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ వైకాపా నుండి మరో ఐదు మంది ఎమ్మెల్యేలు తమకు టచ్‌లో ఉన్నారంటూ మరో బాంబు పేల్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement