అమరావతి, ఆంధ్రప్రభ: వైసీపీ ప్లీనరీలో పాల్గొనే నేతలు, కార్యకర్తలకు షడ్రోషొపేతమైన భోజనాలు వడ్డించారు. 25 రకాలకు పైగా శాఖాహార, మాంసాహార రకాలు తయారు చేశారు. ముఖ్యమంత్రి నుంచి కార్యకర్తల వరకు ఒకే రకమైన మెనూ సిద్ధం చేశారు. ప్లీనరీకి పెద్ద సంఖ్యలో వస్తున్న నేతలు, కార్యకర్తలను దృష్టిలో ఉంచుకొని ఏ విధమైన అసౌకర్యం తలెత్తకుండా నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి రోజు లక్ష మంది వరకు భోజనాలు ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు జరిగే ప్లీనరీకి లక్షలాది మంది వస్తుండటంతో ఎక్కడా భోజన ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. ఐదు వంటశాలల్లో ద్రాక్షారామం, ఇందుపల్లి నుంచి వచ్చిన 300 మంది వంట మనుషులు గురువారం రాత్రి నుంచే ఆహార పదార్థాలు సిద్ధం చేశారు. రాత్రి స్వీట్లు, ఇతర పదార్థాలు తయారు చేయగా శుక్రవారం ఉదయం నుంచి ఆహార పదార్థాలను సిద్ధం చేశారు.
నేతలు, కార్యకర్తలు మధ్య భోజనాల కోసం తొక్కిసలాట చోటు చేసుకోకుండా 25 స్టాల్స్ ఏర్పాటు చేసి వడ్డించారు. ఇందులో మాంసాహార, శాఖాహార ప్రియులకు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేశారు. మాంసాహార ప్రియులకు మటన్ దమ్ బిర్యానీ, కాజు చికెన్ రోస్టు, ప్రాన్స్ కర్రీ, బొమ్మిడాయల పులుసు, కొెర్రమేను పులుసు, చేపల ఫ్రై, ఉలవచారుతో కూడిన ఉడకబెట్టిన గుడ్లు, పీతల ఫ్రై, చపాతి, రెండు రకాల స్వీట్లు వడ్డించారు. శాఖాహారులకు చింత చిగురు పప్పు, బంగాళాదుంప కూర, బ్రెడ్ హల్వా, స్వీటు, వెజ్ బిర్యానీ, ఉల్లిచట్నీ, పెరుగు పచ్చడి, వైట్ రైస్, ఆవకాయ, మునగ కాయ కూర, ఉలవచారు, నెయ్యి, అప్పడాలు, సాంబారు, రసం, మజ్జిగ పులుసు, పెరుగు, వడియాలు, సమోసాలు, ఐసుక్రీము, కిళ్లి, ఫ్రూడ్ సలాడ్ ఏర్పాటు చేశారు. నిర్వహకులు ఏర్పాటు చేసిన భోజనాల పట్ల కార్యకర్తలు సంతృప్తి వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.