Friday, November 22, 2024

రెండేళ్ళయినా రైల్వే జోన్‌ పట్టాలెక్కలేదు… పెండింగ్ ప్రాజెక్టలుపై వైసీపీ ఎంపీల వినతి

విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యకలాపాలను త్వరితగతిన ప్రారంభించాలని వైసీపీ ఎంపీలు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు విజ్ఞప్తి చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి సారధ్యంలో పార్టీ ఎంపీలు గురువారం పార్లమెంట్‌ భవనంలోని కార్యాలయంలో రైల్వే మంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో వివిధ రైల్వే ప్రాజెక్ట్‌ల అమలును వేగవంతం చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని మంత్రికి అందచేశారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు రైల్వే ప్రాజెక్ట్‌ల స్థితిగతులను మంత్రికి వివరించారు. రైల్వేలో అత్యధిక ఆదాయం వచ్చే డివిజన్లలో విశాఖపట్నం కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్‌ ఒకటని ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

వాల్తేరు డివిజన్‌ను రద్దు చేసి విశాఖపట్నం నగరాన్ని విజయవాడ డివిజన్‌ కిందకు తీసుకురావాలన్న ఆలోచన ఘోర తప్పిదం అవుతుందన్నారు. వాల్తేరు డివిజన్‌ రద్దు వలన కొత్త సమస్యలు కోరి తెచ్చుకున్నట్లవుతుందని కూడా ఆయన చెప్పారు. విశాఖపట్నంలోని వాల్తేరు డివిజన్‌లో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. కంటైనర్‌ టెర్మినల్స్‌, లోకో షెడ్‌, వాగన్‌ వర్క్‌షాప్‌, 2300 మంది సిబ్బందికి సరిపడ స్టాఫ్‌ క్వార్టర్లు ఉన్నాయని చెప్పారు. వాల్తేరు డివిజన్‌ను విశాఖపట్నంలో కొనసాగించడం వల రైల్వే అదనంగా ఎలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదన్నారు.

రైల్వేలో నియామకాల కోసం దేశంలో 21 ప్రాంతాల్లో రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు ఉన్నాయని, అయితే, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బోర్డు లేదన్నారు. దీని వలన రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులు ఆర్‌ఆర్‌బీ పరీక్షలు రాయడానికి అటు సికింద్రాబాద్‌ లేదా భువనేశ్వర్‌కు వెళ్ళాల్సి వస్తోందన్నారు. ఈ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు ఆవశ్యకత ఉన్నందున దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే చాలా కాలంగా సాగుతున్న నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైను నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, కర్నూలులో కోచ్‌ వర్క్‌షాప్‌ నెలకొల్పాలని, విజయవాడ-విశాఖపట్నం మధ్య మూడో రైల్వే లైన్‌ నిర్మాణం చేపట్టాలని, తిరుపతి-పాకాల-చిత్తూరు-కట్పడి మధ్య డబుల్‌ లైన్‌ నిర్మాణం చేపట్టాలని విజయసాయి రెడ్డి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement