Friday, November 22, 2024

AP: వైసీపీ ఎంపీ కృష్ణయ్య, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిపై రాళ్ల దాడి

శ్రీకాళహస్తి: బీసీ సంఘం నేత, వైయస్సార్సీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య, స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులో ప్రచారం నిర్వహించారు. గురువారం రాత్రి ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఈ ఇద్దరు నేతలపై రాళ్ల దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు వీరిపైకి రాయి విసిరారు. కాగా, ఆర్.కృష్ణయ్యకు ఆ రాయి తగిలింది. వీపులో ఆ రాయి తగలడంతో అక్కడ గాయమైంది. ఆ రాయిని చూపిస్తూనే ఎన్నికల ప్రచారం కొనసాగించారు నేతలు.

అయితే, ఈ రాయి దాడి చేసింది టీడీపీ నేతల పనేనంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మొన్న ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. నేడు బడుగు, బలహీన వర్గాల నేత, రాజ్యసభ సభ్యులు కృష్ణయ్యపై, స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీసీ నాయకుడు, స్థానిక ఎమ్మెల్యేపై బొజ్జల సుధీర్ రెడ్డి రాళ్ల దాడి చేయించాడని ఆరోపించారు.

అయితే అదృష్టవశాత్తు ఆ రాయి తలకి తగలకుండా వీపుకి తగలడంతో ప్రాణాపాయం తప్పింది. ఇలాంటి పిరికిపంద రాజకీయాలు చేస్తే ఎవరూ భయపడరని ప్రజలు త‌మ‌పై చూపిస్తున్న ఆదరణ తట్టుకోలేక ఎలాగైనా మమ్మల్ని హతమార్చాలని ఇలాంటి రాళ్ల దాడులు చంద్రబాబు నాయుడు ఆదేశాలతో బొజ్జల సుధీర్ రెడ్డి చేయిస్తున్నాడని వైసీపీ నేతలు అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement