అమరావతి – సూపర్ స్టార్ రజనీకాంత్ పై ఎపికి చెందిన వైసిపి నేతలు కు చెందిన మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న రజనీకాంత్ మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో హైదరాబాద్‌ను న్యూయార్క్‌లా, ఏపీని అభివృద్ధి చేశారని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ వ్యాఖ్యలపై వైసిపి నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్ , మంత్రి రోజా , మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. రజనీకాంత్ సినిమాల్లో సూపర్‌స్టార్ అని, రాజకీయాలో కాదని మంత్రి వెల్లంపల్లి ధ్వజమెత్తారు.. ఏపీ రాజకీయాల్లో అవగాహన లేని వ్యక్తి రజనీకాంత్ అని విమర్శించారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినప్పుడు చంద్రబాబుతో రజనీకాంత్ కూడా చేతులు కలిపారన్న విషయం అందరికీ తెలుసని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్మించినట్లు చంద్రబాబు ఏపీలో శాశ్వత సచివాలయం ఎందుకు కట్టలేకపోయాడని నిలదీశారు.
ఇక మంత్రి రోజా మాట్లాడుతూ చంద్రబాబు భజన చేసేందుకు రజనీకాంత్ విజయవాడకు వచ్చారా ? అంటూ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబును రజనీకాంత్ పొగడటం విడ్డూరంగా ఉందని అన్నారు. రజనీ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ కూడా బాధపడుతుందని అన్నారు. చంద్రబాబు లేనప్పుడే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని వెల్లడించారు.
మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ రజనీకాంత్ సిగ్గులేకుండా చంద్రబాబును పొగుడుతున్నారని దుయ్యబట్టారు. పవన్‌ను బ్లాక్‌మెయిల్ చేసేందుకే రంగంలోకి రజనీకాంత్‌ను దించారని పేర్కొన్నారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలను పవన్ గ్రహించాలని సూచించారు. ఎన్టీఆర్ బతికున్నప్పుడు రజనీకాంత్ ఏం చేశారని కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్ సభలకు జనం రాకపోవడం వల్లే రజినీకాంత్ ను చంద్రబాబు రంగంలోకి దించారంటూ ఆరోపించారు..