వైసీపీ నేతలు టెర్రరిస్టుల్లా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు మండిపడ్డారు. గన్నవరంలో ధ్వంసమైన టీడీపీ ఆఫీసును.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దొంగ దెబ్బలు.. దొంగాటలు వద్దని, లగ్నం పెట్టుకుని ఎవరేంటో తేల్చుకుందామంటూ బాబు.. వైసీపీకి సవాల్ చేశారు. పోలీసులు లేకుండా వస్తే చూసుకుందామని, వారిని పక్కన పెట్టి ధైర్యం ఉంటే సైకో కూడా రావాలని, పిచ్చి రౌడీ చేష్టలకు భయపడేది లేదని బాబు చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలు పక్కా ప్లాన్ తోనే టీడీపీ ఆఫీసును ధ్వంసం చేశారని ఆరోపించారు. పెట్రోలు, రాళ్లతో వచ్చి దాడులు చేశారని విమర్శించారు.
మొత్తం ఐదు కార్లు, రెండు బైకులను ధ్వంసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు గుండాల్లా వ్యవహరిస్తున్నారని.. టీడీపీ ఆఫీసులో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారని చంద్రబాబు ఆరోపించారు. కొంతమంది పోలీసుల నిర్లక్ష్యం వల్లే వైసీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారని చెప్పారు. తాను ప్రజా సంక్షేమం, అభివృద్ది కోసమే అనునిత్యం పనిచేశానని చంద్రబాబు అన్నారు. తమ ఆస్తులపై దాడి చేసి.. తిరిగి కేసులు ఎలా పెడతారని నిలదీశారు. పోలీసులు మొదట్లోనే వైసీపీ నేతల దౌర్జన్యాన్ని అడ్డుకుని ఉంటే ఇలా జరిగేది కాదన్నారు. వైసీపీ నేతల్ని తరిమికొట్టేందుకు ప్రజలంతా ఏకం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సీఎం జగన్ ను నమ్ముకున్నవాళ్లంతా జైలుకు పోతారని ఆయన ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక వడ్డీతో సహా తిరిగిస్తానని చంద్రబాబు సవాల్ చేశారు. వ్యవస్థలో చీడ పురుగుల్ని తొలగిస్తానని అన్నారు.