Sunday, October 20, 2024

AP | వ‌ర‌ద సాయంపై గ‌వ‌ర్న‌ర్ కు వైసీపీ నేత‌ల‌ విన‌తి…

(ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో) : కూటమి ప్రభుత్వ పూర్తి నిర్లక్ష్యం కారణంగానే వరదల్లో తీవ్ర నష్టం జరిగిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ రుహులతో పాటు పలువురు నేతలు ఆరోపించారు. వరదల తర్వాత కూడా అలసత్వం ప్రదర్శించడంతో బాధితులకు నేటికీ న్యాయం జరగలేదన్నారు. బాధితులందరికీ తీవ్ర అన్యాయం ఒకవైపు జరిగితే మరోవైపు విరాళాల పేరుతో కోట్లు దండుకున్నారని ఆరోపించారు.

వరద బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని కోరుతూ విజయవాడలోని రాజ్ భవన్లో శనివారం గవర్నర్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం విలేకరులతో మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విజయవాడలో వరద బాధితులకు నేటికీ నష్టపరిహారం అందలేదన్నారు. బాధితులకు జరిగిన అన్యాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు.

సాయం అందలేదని రోడ్డెక్కిన మహిళల పై లాఠీ ఛార్జి చేశారన్నారు. రూ 500 కోట్లు విరాళాలొచ్చినా సాయం అందించలేదన్నారు. వరదల పై సమాచారం ఇవ్వలేదన్న ఆయన, వరదల్లో సాయం చేయలేదని, వరదలు తగ్గాక కూడా న్యాయం జరగలేదన్నారు. వరద బాధితులకు సాయం అందకపోవడం పై గవర్నర్ ఆశ్చర్యపోయారని,బాధితులందకికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఇది మంచి ప్రభుత్వం కాదు చేతకాని ప్రభుత్వం అని విమర్శించారు. డబ్బులు దండుకోవడానికే కానీ బాధితులకు సాయం చేయడం చేతకాదన్నారు. మద్యం టెండర్లు…ఇసుకను దోచుకోవడానికేనా ఈ ప్రభుత్వం ఉందన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు,దేవినేని అవినాష్ మాట్లాడుతూ నేటికీ సాయం అందక వరద బాధితులు కలెక్టరేట్ ముందు రోజూ ధర్నాలు చేస్తున్నారని చెప్పారు.

ఈ ప్రభుత్వానికి మైన్…వైన్ టెండర్ల పై ఉన్న దృష్టి వరద బాధితుల పట్ల లేదన్నారు. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తున్నారని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గ ఇంఛార్జి,మాజీ ఎమ్మెల్యే, మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఎన్యుమరేషన్ అంతా తప్పుల తడకగా ఉందన్నారు.ఎన్యుమరేషన్ లో సగం మంది బాధితులను వదిలేశారని, కలెక్టరేట్ లో బాధితులు వినతిపత్రం ఇస్తే కనీసం పరిశీలన చేయలేదన్నారు. గవర్నర్ ను కలిసిన వారిలో మేయర్ రాయని భాగ్యలక్ష్మి, పిఎసి కమిటీ సభ్యుడు ఆసిఫ్ వైసిపి నేత గౌతమ్ రెడ్డి, డిప్యూటీ మేయర్లు శైలజా రెడ్డి బెల్లం దుర్గ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement