(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : వైసీపీ సిద్ధాంతాలు, ఆ పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి విధ్వంసక విధానాలు నచ్చక పలువురు ఆ పార్టీని వీడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో వైసీపీకి షాక్ తగిలింది. జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఆయన తండ్రి రంగాపురం నర్సింహారావు మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు.
వారితో పాటు 7వ వార్డు కౌన్సిలర్ పూసపాటి సీతారావమ్మ దంపతులు, 31వ వార్డు కౌన్సిలర్ గింజుపల్లి వెంకట్రావు, కుమారుడు కృష్ణ, 23వ వార్డు కౌన్సిలర్ డి.రమాదేవి దంపతులు టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిశాయన్నారు. ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించి బాధితులకు అండగా నిలిచిందన్నారు. వరదలోనూ జగన్ రెడ్డి బురద రాజకీయాలు చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఇతర నాయకులు ఉన్నారు.