అమరావతి, ఆంధ్రప్రభ : అధికార పార్టీలో ఎన్నికల ఏడాది గ్రూపుల గోల పీఛమణచేలా అధిష్టానం వ్యూహాత్మకం గా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఏఏ జిల్లాల్లో ఎవరెవరి మధ్య గ్రూపిజం నడుస్తుందన్న దానిపై పక్కా సమాచారాన్ని చేతిలో పట్టుకున్న పార్టీ ఆధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆచితూచి అడుగులేయాలని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మాజీ మంత్రి, ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాస రెడ్డితో పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌ఛార్జి, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు. ఎంపీ విజయసాయి స్వయంగా బాలినేని ఇంటికి వెళ్లి గంటకుపైగా చర్చలు జరిపారు. అధిష్టానం చెప్పిన పలు అంశాలను ఆయనకు వివరించారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా గతంలో చేసిన రాజీనామాను ఉపసంహరించుకుని పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ కావాలని సూచించినట్లు తెలిసింది. అంతేకాకుండా అక్కడ రాజకీయంగా విబేధాలున్న వైవీ సుబ్బారెడ్డి పూర్తిగా ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌ఛార్జి హోదాలో పనిచేసుకుంటూ పోతారని సముదాయించినట్లు చెబుతున్నారు. సుబ్బారెడ్డి జోక్యం అంతగా ఉండబోదని కూడా అధిష్టానం చెప్పిందని ప్రచారం జరుగుతోంది.
అయితే, దీనిపై అటు బాలినేనిగానీ, ఇటు విజయసాయిగానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉండగా ఒకవైపు బాలినేనిని సముదాయిస్తూనే ఆయన అధిష్టానం మట వినకుంటే ఆయన స్థానంలో విజయసాయికి ప్రాంతీయ సమన్వయకర్తగా అవకాశం కల్పించేందుకు కూడా వెనుకాడబోదన్న సంకేతాలను పంపినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరగుతోంది. బాలినేని మాత్రం విజయసాయి దౌత్యా నికి కొంత మెత్తబడినట్లు తెలిసినా ఇంకా పూర్తిగా అంగీకారం తెలిపలేదని అంటున్నారు. బాలినేని కూడా వేరే పార్టీలోకి వెళ్లలేక, ఈ పార్టీలో ఉంటూ కార్యకర్తలకు అండగా నిలవలేక మానసికంగా సంఘర్షణకు గురవుతున్నారని, ఈ విషయాన్ని అధిష్టానం కూడా గుర్తించబట్టే సాచివేత ధోరణి అవలంభిస్తూ వస్తోందని అంటున్నారు. అంతేకాకుండా సుబ్బారెడ్డి దూకుడుకు కూడా బ్రేకులు వేసినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో విజయసాయి ఏం చెప్పారు.. బాలినేని నిర్ణయం ఎలా ఉండబోతోందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
సీరియస్‌గా పిల్లి వర్సెస్ చెల్లు వివాదం
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లోకెక్కడంపై అధినేత అగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణల మధ్య అగాధం అంతకంతకూ పెరుగుతూ ఆదివారం తీవ్రస్థాయికి చేరుకుంది. ఇద్దరూ బహిరంగంగా మీడియాకెక్కి మాట్లాడటం క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈమేరకు అక్కడ జరుగున్న సున్నితమైన అంశాలన్నింటినీ అధినేత నిశితంగా గమనిస్తున్నట్లు చెబుతున్నారు. స్వయంగా తానే పిలిచి మాట్లాడి పంపిన తరువాత అక్కడ బజారుకెక్కడంపట్ల అధినేత తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తంచేశారని సమాచారం. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవడానికి అక్కడ ఒకవైపు అధినేత కుటుంబానికి విధేయుడిగా ఉంటూ పార్టీ ఆవిర్భావం నుండి ఆయనతో నడిచిన వ్యక్తి ఒకరైతే, తానే టిక్కెట్టు ఇచ్చి, ఎమ్మెల్యేనుచేసి మంత్రిని చేసిన వ్యక్తి మరొకరు. ఈనేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల పార్టీ బాధ్యుడు, లోక్‌సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి అధినేత పలు సూచనలు చేశారని చెబుతున్నారు. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న వార్‌ను సీరియస్‌గా తీసుకుని త్వరలోనే ఫుల్‌స్టాప్ పెట్టాని స్పష్టంగా చెప్పారని అంటున్నారు. ఆదివారం పార్లమెంట్‌కు కూడా సెలవు కావడంతో మిథున్ అక్కడి అంశాలను ఆయనకున్న వివిధ రకాల మార్గాల ద్వారా సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారంటున్నారు. ఇద్దరితోనూ మాట్లాడి పార్టీ తీసుకునే నిర్ణయం ఎటూ తీసుకుంటుందని, కానీ ఈలోగా మీడియాకెక్కి మాట్లాడొద్దని ఆయన స్పష్టంగా సూచించాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. అయితే, వారితో ఈ అంశంపై మాట్లాడే ముందుకు సీఎం జగన్‌తో మరోమారు మాట్లాడి ఫైనల్‌గా ఒక నిర్ణయానికి వచ్చిన మీదట వారికి చెప్పాల్సిన రీతిలో చెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం.
నందికొట్కూరు ఘటన వెనుక కారణాలేంటి?
కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్థర్ , శాప్ ఛైర్మన్ బైరెడ్డి వర్గాలు రోడ్డెక్కి ఆందోళ నలకు దిగడంపై కూడా పార్టీ సీరియస్‌గా దృష్టి పెట్టాలని నిర్ణ యం తీసుకుంది. ఎస్సీ నియోజకవర్గం ఒకవైపు, అక్కడ అభ్య ర్ధిని గెలిపించడంలో కీలక భూమిక పోషించిన నేత మరొ వైపు ఉండటంతో అక్కడ కూడా సమస్య సున్నితంగా మారింది. ఈ క్రమంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నదానిపై ఆచితూచి అడు గులేస్తోంది అధిష్టానం. ఇద్దిరికీ ఎవరికి చెప్పే రీతిలో వారికి చెప్పి రోడ్డెక్కకుండా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే తరహాలో రాష్ట్రంలో గ్రూపిజం నడుస్తున్న పలు నియోజక వర్గాలపై కూడా అధిష్టానం సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. ఎక్క డెక్కడ సమస్య సున్నితంగా ఉందో అక్కడ ముందుగా ఒక నిర్ణయం తీసుకుని మందేయాలని భావిస్తున్నట్లు సమాచారం.