రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఏపీ, తెలంగాణ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వ తీరుపై వైసీపీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే తెలంగాణ నేతలు భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని రామచంద్రయ్య ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం చాలా సున్నితమైన అంశమని, దాన్ని తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాయలసీమకు అన్యాయం జరిగిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారని, రాష్ట్రానికి కేటాయించిన నీటినే తాము వాడుకుంటున్నాని స్పష్టం చేశారు. లేని సమస్యను ఉన్నట్లుగా సృష్టిస్తూ ప్రజలను తెలంగాణ మంత్రులు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రులను కంట్రోల్ చేయాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి వైఎస్ ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. అన్ని ప్రాంతాలకు వైఎస్సార్ సాగునీరు అందించారని తెలిపారు. వైఎస్సార్‌పై విమర్శలు చేస్తున్న తెలంగాణ మంత్రులు చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు.
ఇదీ చదవండి: పరీక్షలు వాయిదా వేయండి: మోదీకి లేఖ రాసిన సీఏ స్టూడెంట్స్