తిరుమల : రాబోవు ఎన్నికల్లో మూడు రాజధానుల అంశాన్ని మేనిఫెస్టోలో చేరుస్తామని.. తిరిగి రాష్ట్రంలో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని విశాఖ ఎంపీ సత్యనారాయణ జోస్యం చెప్పారు. నేడు తన జన్మదినం కావడంతో స్వామి వారీ ఆశీస్సులు పొందేందుకు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆయన విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పరిపాలనను వికేంద్రీకరించాలని జగన్ సంకల్పించి.. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చెయ్యాలని జగన్ నిర్ణయం తీసుకున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన 6నెలల్లోనే మూడు రాజధానులపై ప్రభుత్వం ప్రకటన చేసిందన్నారు. మూడు రాజధానుల ఏర్పాటును కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని.. ఎవరు అడ్డుకున్నా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామన్నారు. మూడు రాజధానుల బిల్లును త్వరలోనే తిరిగి అసెంబ్లీలో ప్రవేశ పెడుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉన్నత విద్యనందించేందుకు ప్రభుత్వం విద్యాలయాల్లో మార్పులు చేసిందన్నారు.