Friday, November 22, 2024

నెల్లూరు పురపోరులో వైసీపీ హవా

నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సొంత పార్టీ నేతలే వెన్నుపోటుతో షాక్‌ ఇస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న అనేక ప్రాంతాల్లో వైసీపీతో చేతులు కలిపిన తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది అభ్యర్థులు చివరి నిమిషంలో నామినేషన్లు ఉపసంహరించుకుని పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో నెల్లూరు కార్పొరేషన్‌లోని 8 డివిజన్లలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పోటీయే లేకుండా పోయింది. నామినేషన్ల ప్రక్రియ వరకు నువ్వా .. నేనా అన్నట్లుగా సాగిన పురపోరు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియకు వచ్చేసరికి అధికార వైసీపీ పూర్తిస్థాయిలో పట్టు సాధించే దిశగా వ్యూహాత్మకంగా పావులు కదిపింది. వైసీపీ నేతల రాజకీయ ఎత్తును టీడీపీ జిల్లా నేతలు అంచనా వేయలేక చతికిల పడ్డారు. ఫలితంగా వైసీపీకి ఏకగ్రీవాల గెలుపు గుర్రంపై ప్రయాణం చేసింది.


వెన్నుపోటుతో టీడీపీకి ఎదురుదెబ్బ :
నెల్లూరు నగర కార్పొరేషన్‌లో తెలుగుదేశం పురపోరును ఓ సవాల్‌గా తీసుకున్నట్లు కనిపిస్తున్నప్పటికీ .. నామినేషన్ల ప్రక్రియ పరిశీలన రోజే ఎదురుదెబ్బ తగలడంతో నాలుగు డివిజన్లు ఏకగ్రీవంగా వైసీపీ గెలుచుకుంది. నామినేషన్ల ఉపసంహరణలకు చివరి రోజైన సోమవారం మరో నాలుగు డివిజన్లు ఏకగ్రీవంగా మొత్తం 8 డివిజన్లు అధికార వైసీపీ ఖాతాలో చేరాయి. ఆ పార్టీకి చెందిన కొంతమంది నేతలు పథకం ప్రకారం వైసీపీకి అనుకూలంగా వ్యవహరించి సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచారు. దీంతో నెల్లూరు కార్పొరేషన్‌లో సైకిల్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. పోటీలో ఉన్న అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకుని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. 54 డివిజన్లు ఉన్న నెల్లూరు కార్పొరేషన్‌లో కీలకమైన స్థానాల్లో టీడీపీ పోటీలోనే లేకుండా పోయిందంటే సొంత పార్టీ నేతలు ఏ స్థాయిలో వెన్నుపోటు పొడిచారో స్పష్టంగా అర్థమవుతోంది.


బలం ఉన్న చోట కూడా టీడీపీ అభ్యర్థుల ఉప సంహరణ :
నెల్లూరు కార్పొరేషన్‌లో సిటీ నియోజకవర్గ పరిధిలో 7,8,40 డివిజన్లు, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ పరిధిలో 12, 20, 24, 37, 38 డివిజన్లను వైసీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. అందుకు సంబంధించి ఎన్నికల అధికారులు డిక్లరేషన్‌ పత్రాలను కూడా అందజేశారు. అయితే ఆ 8 స్థానాలతో పాటు మరికొన్ని డివిజన్లలో తెలుగుదేశం అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. వాస్తవానికి టీడీపీ పోటీ నుంచి తప్పుకున్న డివిజన్లలో రెండు పార్టీలకు విజయావకాశాలు సమానంగా ఉన్నాయి. ఇదే అభిప్రాయం ఇరు పార్టీల్లోనూ వ్యక్తమవుతోంది. అందుకే వైసీపీ వ్యూహాత్మకంగా టీడీపీకి కొంత అనుకూలంగా ఉన్నడివిజన్లపై మొదటి నుంచి ప్రత్యేక దృష్టి సారించింది. ఆ దిశగా పోటీలో ఉన్నఅభ్యర్థులు వైసీపీ నేతలకు టచ్‌లోకి రావడంతో వారి వ్యూహం ఫలించినట్లు అయింది.

- Advertisement -


పట్టు నిలుపుకున్న ఇరిగేషన్‌ మంత్రి అనిల్ :
నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ సవాల్‌గా తీసుకున్నారు. అందుకే నోటిఫికేషన్‌ ముందు నుంచే ఎక్కువ సమయం నెల్లూరుకే కేటాయిస్తూ నిరంతరం ప్రజల్లో ఉంటూ వచ్చారు. నోటిఫికేషన్‌ వెలువడ్డాక బలమైన అభ్యర్థులను రంగంలోకి దించడంతో పాటు తెలుగుదేశం ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఎప్పటికప్పుడు కార్పొరేషన్‌పై పూర్తి స్థాయి పట్టుకు పావులు కదుపుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నామినేషన్ల ఉపసంహరణలకు చివరి రోజైన సోమవారం నెల్లూరు సిటీ, గ్రామీణ నియోజకవర్గ పరిధిలో 8 డివిజన్లను ఏకగ్రీవంగా కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి కూడా ఏకగ్రీవాలపై చక్రం తిప్పి మరోసారి తనకు తిరుగులేదని చాటుకున్నారు. ఇదిలా ఉండగా, తెలుగుదేశం పోటీలో లేని డివిజన్లలో జనసేనకు మద్దతిచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా టీడీపీ, జనసేన నేతల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.


నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో అధికార పార్టీకి తొత్తులుగా అధికారులు :
కలెక్టరేట్‌ ముందు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రుల ధర్నా :
నెల్లూరు నగర కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించి అధికారులు మంత్రి అనిల్‌, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలకు తొత్తులుగా మారిపోయారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. సోమవారం నెల్లూరుకు చేరుకున్న ఆయన మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చిన్న రాజప్ప, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నక్కా ఆనంద్‌బాబులతో కలిసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అరాచకాలు, మంత్రి అనిల్‌ , నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డిల బెదిరింపులకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టరేట్‌ ముందు బైటాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నెల్లూరు నగర కార్పొరేషన్‌లో టీడీపీ అభ్యర్థులను నిలపలేదని మంత్రి అనిల్‌, ఎమ్మెల్యే కోటంరెడ్డిలు ప్రగల్భాలు పలికారని , 54 డివిజన్లకు అభ్యర్థులను నిలిపి టీడీపీ తన సత్తా నిరూపించుకుందన్నారు. అరాచకాలు , బెదిరింపులు, దాడులతో కొంత మంది టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు ఉపసంహరించుకునేలా భయానక వాతావరణాన్ని నెలకొల్పారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆర్‌వోల పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి వైసీపీ నేతలు బెదిరించారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ… ఇంత దుర్మార్గమైన ఎన్నికలను తన రాజకీయ జీవితంలో చూడలేదన్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆర్‌వోలు డమ్మీగా మారిపోయారని, అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందన్నారు. కొంతమంది అధికారుల కన్నా అటెండర్లే మేలుగా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు ఆర్‌వోలు టీడీపీ అభ్యర్థులకు ఫోన్‌ చేసి సంతకాలు పెట్టాలి.. రమ్మంటున్నారని అభ్యర్థులు ఎందుకు రావాలి.. కనీసం అధికారులకు బుద్ధి ఉందా అంటూ ప్రశ్నించారు. నెల్లూరు అక్రమాలపై తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌ ముందు వైసీపీ దౌర్జన్యాలు నశించాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నెల్లూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ , నాయకులు బీసీ జనార్థన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, తాళ్లపాక అనూరాధ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement