ఇవాళ వైసీపీ ఫైనల్ లిస్టును ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇవాళ ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి దగ్గర నివాళులర్పించి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు జగన్. మార్పుచేర్పుల్లో భాగంగా ఇప్పటికే సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల గెలుపోటములపై సర్వేల ఆధారంగా ఇప్పటికే 70కి పైగా అసెంబ్లీ, 20కి పైగా లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేశారు.
ఉదయం తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు సీఎం జగన్. మధ్యాహ్నం కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయ వెళ్తారు. వైఎస్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం వైసీపీ ముఖ్య నేతల సమక్షంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తారు సీఎం జగన్. ఆ తర్వాత కాసేపు గెస్ట్ హౌస్‌లో విశ్రాంతి తీసుకుని ఇడుపులపాయ నుంచి కడపకు బయల్దేరతారు. అక్కడ నుంచి విమానంలో గన్నవరం వెళ్తారు.
శనివారం అభ్యర్థుల తుది జాబితా ప్రకటన సందర్భంగా పార్టీ నేతలకు సమాచారం ఇచ్చింది వైసీపీ. ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటనకోసం.. కడప జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. వైఎస్ సమాధి వద్ద రెండు వందల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. అయితే, వేదికపై 11 మందికి మాత్రమే కూర్చునే లా ఏర్పాట్లు చేశారు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యే అవకాశం ఉంది.. ఇప్పటికే ఈ విషయాన్ని పార్టీ నాయకులకు సమాచారం ఇచ్చింది వైసీపీ.. పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలో పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. గత ఎన్నికల సమయంలోనూ జగన్.. పార్టీ అభ్యర్థులను ఇలానే ప్రకటించారు.