అమరావతి – వైసీపీ నుంచి గెలిచి, ప్రస్తుతం అసమ్మతి గళం విప్పుతున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి వైసిపి ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు.అసెంబ్లీ రెండోరోజునుంచే ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలలకు దిగారు.. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అసెంబ్లీ లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. మైక్ ఇచ్చే వరకు అసెంబ్లీలో అడుగుతూనే ఉంటానని కోటంరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తన నిరసన కొనసాగుతుందన్నారు. సమస్యలు పరిష్కరిస్తే సీఎంను అభినందిస్తా అని చెప్పారు. నాలుగేళ్లుగా సమస్యల పరిష్కారం కోసం తిరిగి తిరిగి విసిగిపోయానని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, కోటంరెడ్డి సభను అడ్డుకునేందుకే వచ్చారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శ్రీధర్‌రెడ్డిపై టీడీపీకి ఇప్పుడు ప్రేమ వచ్చిందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, టీడీపీ కోసం కోటంరెడ్డి పని చేస్తున్నారని అంబటి ఆరోపించారు. అలాగే
ఆర్థిక మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ కూడా కోటంరెడ్డి తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యక్తిగత అంశాలకు సభలో చోటులేదని ఆయన అన్నారు. ఇది ఇలా ఉంటే అంతరాత్మ ప్రభోదానుసారo ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తానని కోటంరెడ్డి తేల్చి చెప్పడంతో వైసిపి లో ఆందోళన మరింత పీక్ కు చేరింది..