45 రోజుల్లో 30కిపైగా హత్యలు జరిగాయని ఆరోపణ
300మంది వలస వెళ్లిపోయారని ఆవేదన
560 మంది ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు ధ్వంసం
రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్
ఆంధ్రప్రభ స్మార్ట్ – న్యూఢిల్లీ : ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఏపీలో జరిగిన విధ్వంసం, హత్యలు, అరాచకల ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. అనంతరం ఈ ఘటనలను నిరసిస్తూ, దీక్ష చేపట్టిన జగన్ మీడియాతో మాట్లాడుతూ…. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని పేర్కొన్నారు.
45 రోజుల్లోనే 30కిపైగా హత్యలు జరిగాయని ఆరోపించారు. దాడుల భయంతో దాదాపు 300మంది వలస వెళ్లిపోయారని తెలిపారు. ప్రైవేటు ఆస్తులను యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే 560 మంది ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు ధ్వంసమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా ? లేదా ? అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేశ్ రెడ్‌బుక్ పట్టుకున్న ఫొటోలతో కూడిన హోర్డింగ్‌లు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశారని తెలిపారు. ఇది ఎలాంటి సందేశాన్ని పంపుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. దాడులు చేస్తున్న, చంపుతున్న, ఆస్తులు ధ్వంసం చేస్తున్న వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో హత్యా రాజకియాలు ప్రొత్సహించలేదన్నారు జగన్. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదన్నారు. ఏపీలో శాంతి భద్రతలు లోపించాయని తెలిపారు. ఏపీలో రాష్ట్ర పతి పాలన విధించాలని కోరారు జగన్.
కాగా, ఈ ధర్నాకు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మద్దతు ప్రకటించారు.. జగన్ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ఆయన తిలకించారు.