దేవాలయాల్లో పాటించాల్సిన ఆనవాయితీని ప్రశ్నిస్తే దాడులు చేసే సంస్కృతికి వైసీపీ ప్రభుత్వం దిగజారిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. విజయనగరం రామతీర్థంలో తీవ్ర ఉద్రిక్త నెలకొన్న సంగతి తెలిసిందే.. బోడికొండపై రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన జరుగుతున్న సమయంలో ఆలయ ధర్మ కర్త అశోక్ గజపతిరాజుకు మంత్రి వెల్లంపల్లికి మధ్య వాగ్వాదం జరగడం.. తనను కొబ్బరికాయ కూడా కొట్టకుండా మంత్రి వెల్లంపల్లి అడ్డుకున్నారని అశోక్ గజపతి రాజు అసహనం వ్యక్తం చేయడం, ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ఈ పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి రౌడీల్లా అశోక్ గజపతిరాజుపై మంత్రులు దాడికి తెగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా.. రామతీర్థం రాముని సాక్షిగా వైసీపీ అరాచకం బట్టబయలైందన్నారు. రామతీర్థం ఆలయ కమిటీ ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతి రాజు పేరు లేకుండా కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారు? అని ప్రశ్నించిన ఆయన.. వేల ఎకరాలను దానం చేసిన కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇదేనా..? కనీసం ప్రోటోకాల్ నిర్వహించాలన్న బుద్ధి ఈ ప్రభుత్వ పెద్దలకు లేదా.? అంటూ ధ్వజమెత్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అశోక్ గజపతిరాజుపై కక్షగట్టారని విమర్శించారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా తొలగించి భూములు దోచుకోవాలని చూశారని చంద్రబాబు ఆరోపించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital