విశాఖపట్నంలో ఈరోజు వైసీపీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లతో పాటు పలువురు నేతలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో చేరికలు ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పవన్ స్పష్టం చేశారు.
జనసేన నాయకులు, కార్యకర్తలు రాజకీయంగా అన్ని విధాలుగా ఎదగాలని కోరుకుంటున్నాను అని అన్నారు. జివిఎంసి స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో కూటమిని గెలిపించే విధంగా అంతా కృషి చేయాలి అని అన్నారు. త్వరలో విశాఖలో పొల్యూషన్ ఆడిట్ నిర్వహిస్తాం. విశాఖలో కాలుష్య నివారణకు కార్పొరేటర్లుగా మీ వంతు కృషి చేయాలని సూచించారు.
పర్యావరణ శాఖ మంత్రిగా కాలుష్య నియంత్రణ మండలి నా పరిధిలో ఉంది. త్వరలో విశాఖను సందర్శిస్తాను. ఏమైనా సమస్యలుంటే నా దృష్టికి తీసుకురావాలన్నారు. విశాఖలో రియల్ ఎస్టేట్ సమస్యలు కూడా చాలా ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా పేదలకు న్యాయం చేసేందుకు కార్పొరేటర్లు కృషి చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.