అమరావతి : చంద్రగిరి మండలం, భీమవరం గ్రామ టీడీపీ అధ్యక్షుడు మునిరత్నం నాయుడుపై వైసీపీ గూండాల దాడిని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. వారు మాట్లాడుతూ… మద్యం, గంజాయి మత్తులో చెవిరెడ్డి అనుచరులు కొటాల చంద్రశేఖర్ రెడ్డి, నవీన్ రెడ్డి తన అనుచరులతో ఇష్టానుసారంగా దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెవిరెడ్డి భాష్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి తన చెంచాలను అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
ఓటమి అంచున వైసీపీ వేలాడుతున్నందునే దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి గాల్లో తిరుగుతూ శాంతిభద్రతలు గాలికొదిలేశారని, ఎన్ని దాడులు, బెదిరింపులకు దిగినా టీడీపీ వెనకడుగు వేయదన్న విషయాన్ని వైసీపీ గూండాలు గుర్తుంచుకోవాలన్నారు. పవిత్రమైన తిరుపతి పరిసర ప్రాంతాల్లో అలజడి సృష్టిస్తున్నారని, మునిరత్నం నాయుడుపై దాడి చేసి నగదు, బంగారం కూడా లాక్కెళ్లి బందిపోటు ముఠాను తలపించారని దుయ్యబట్టారు. వైసీపీ నేతలు ఓటమి భయంతోనే టీడీపీ నేతలపై దాడులకి తెగబడుతున్నారన్నారు. దాడి చేసిన వైసీపీ నేతలపై ఎస్పీ పరమేశ్వరరెడ్డి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ దాడిలో మునిరత్నం తీవ్రంగా గాయపడ్డారని, మునిరత్నం కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని నారా లోకేష్, అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.