ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు. ఈ మేరకు అనంతపురం జిల్లా నుంచి ఓ యాత్రను చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. అంతేకాకుండా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈ సందర్భంగా అందించనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రైతుల ఆత్మహత్యలు అత్యంత బాధాకరమని, రైతే దేశానికి జీవనాధారమని అన్నారు. అంతటి రైతులను ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,857 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వివరించారు. కర్నూలులో 353 మంది, అనంతపురంలో 173 మంది, గోదావరి జిల్లాల్లో 85 మంది కౌలు రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటికీ ప్రభుత్వం బాధ్యత వహించదా? అంటూ పవన్ సూటిగా ప్రశ్నించారు. జగన్ పాలన ఏమాత్రం బాగోలేదని, మరోమారు జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాదని పవన్ అన్నారు.