Monday, November 25, 2024

రైతుకు ఏటేటా తప్పని నష్టాలు..

చాపాడు, (ప్రభన్యూస్‌): జిల్లాలో ప్రధాన సాగు నీటి వనరులలో ఒక్కటైన కేసీ కెనాల్‌ పరిధిలో అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది. ఇంత కాలం కాలువకు నీరు సక్రమంగా రావడం లేదని రైతులు ఆందోళన చెందుతూ వస్తే, గత రెండేళ్లుగా వర్షాలు అనుకూలించగా సకాలంలో పంటలు సాగు చేయడం జరుగుతోందని రైతులు పేర్కొంటున్నారు. దేవుడు దయవల్ల నీటికి ఆటంకం లేకపోయినా ప్రకృతి సహకరించడం లేదని రైతులు వాపోతున్నారు. గత ఏడాది నవంబర్‌ మాసంలో వచ్చిన తుఫాన్‌ వల్ల వరి పంట నేలకొరిగి పూర్తిగా పంట నష్టం వాటిల్లిందని రైతులు పేర్కొంటున్నారు. కేసీ కెనాల్‌, దాని అనుబంధ మైన చాపాడు ఛానల్‌ కింద సుమారు 10 వేల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట దెబ్బతింది. పంట నష్టంతో పాటు- పంటల బీమా కూడా చాలా మంది రైతులకు ప్రభుత్వం అందివ్వడం జరిగింది.

ఈఏడాది కూడా అదే తరహాలో తుఫాన్‌ లు ఆరంభమయ్యాయి. ఒకటి పోతే ఒకటి తుఫాన్‌ లు తగులుతూ పంట నష్టాలు జరుగుతున్నాయి. పంట కోతలకు ఆటంకం కలగడంతో పాటు- అక్కడక్కడా వరి పంట నేలకొరిగి నష్టం వాటిల్లితోందని రైతులు వివరిస్తున్నారు. ఇప్పటి వరకు అయ్యా గ్రామాల్లో అధికారికంగా 600 ఎకరాల్లో వరి పంట దెబ్బతిందని మండల వ్యవసాయ శాఖ అధికారిణి మ్యాగీ పేర్కొన్నారు. అనాధికారికంగా మరింత ఎక్కువ భాగంలో పంట నష్టం జరిగి ఉండవచ్చు అని రైతులు అంటున్నారు. అంతేకాకుండా పంట నష్టంకు తోడు దిగుబడులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి అని రైతులు వాపోతున్నారు.

కాస్త చేతికి అందిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించడం లేదని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్‌ లో చేతికి అందిన వరి ధాన్యానికి ఏడాది కాలం దాటుతున్న ఒక పుట్టి (8బస్తాలు)ధర 12వేల నుంచి 13వేల రూపాయలకు దాటడం లేదని రైతులు పేర్కొంటున్నారు. ఈఏడాది పండిన పంటకు ఆ ధరలు కూడా లేవని రైతులు వాపోతున్నారు. పంట నూర్పిడి ఆరంభంలో పుట్టి ధర 8వేల రూపాయిలలోపు ఉందని రైతులు పేర్కొంటున్నారు. ఏదిఏమైనా ఏటేటా వస్తున్న తుఫాన్‌ల‌ వల్ల రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోందని వాపోతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement