Saturday, November 23, 2024

అనకాపల్లి బెల్లానికి ప్రపంచ స్థాయి గుర్తింపు.. జియోగ్రఫికల్ ట్యాగ్ జారీ చేయాలి: ఎంపీ సత్యవతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అద్భుతమైన రుచి, సువాసన కలిగి ఉండే అనకాపల్లి బెల్లాన్ని అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ చేయడానికి భౌగోళిక సూచిక ( జియోగ్రఫికల్ ఇండికేషన్ ) ట్యాగ్ జారీకి చర్యలు చేపట్టవలసినదిగా వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సత్యవతి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా గురువారం ఆమె జీరో అవర్‌లో మాట్లాడారు. అనకాపల్లి బెల్లం మార్కెటింగ్‌కు జీఐ ట్యాగ్‌పై వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు.

అనకాపల్లి బెల్లం మార్కెట్ 18వ శతాబ్దం నుంచి మనుగడ సాగిస్తోందని, భారతదేశంలో రెండవ అతిపెద్ద బెల్లం మార్కెట్ ఇదేనని తెలిపారు. ఇక్కడి బెల్లం ప్రత్యేకమైన రుచి, వాసనతో పరిశుభ్రతకు ప్రసిద్ధి చెందిందని ఎంపీ చెప్పుకొచ్చారు. అధిక పోషక విలువలు కలిగి ఉండే ఈ బెల్లం పరిశ్రమపై అనేకమంది ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. జీఐ ట్యాగ్‌ దేశంలో బెల్లం మార్కెట్‌ను పెంచడానికి, ఎగుమతుల పరిమాణాన్ని పెంచడానికి సహాయపడుతుందనీ ఆమె కేంద్రానికి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement