(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : ప్రపంచవ్యాప్తంగా నాస్తికుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతుందని ప్రపంచ నాస్తిక మహాసభల కన్వీనర్ డాక్టర్ జి. సమరం పేర్కొన్నారు. ప్రపంచంలో 20 దేశాల్లో 50 శాతానికి పైగా ప్రజలు నాస్తికత్వాన్ని అనుసరిస్తున్నారని ఆయన తెలిపారు.
ఈనెల 4 ,5 తేదీల్లో విజయవాడలోని నాస్తి కేంద్రంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు జరగబోతున్నాయి. ఈ మహాసభలను పురస్కరించుకొని గురువారం నాడు స్థానిక నాస్తిక కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మహాసభల వివరాలను డాక్టర్ సమరం తెలిపారు.
సమాజంలోని అన్నింటిలోనూ సమానత్వ భావము పెంపొందుతుందని, మనిషిలోని స్వశక్తి మీద విశ్వాసం పెరుగుతుందని డాక్టర్ సమరం తెలిపారు. దేవుడు మరో ఆలోకిక శక్తితో తోడ్పడతాయని భావం క్రమేపీ తొలిగిపోతుందని ఆయన పేర్కొన్నారు. సెక్యులర్ భావాలు పెంపొందుతూ కులరహిత, మతరహిత సమాజం వైపు అడుగులు బలంగా పడుతున్నాయని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం, సెక్యులరిజం పెరుగుతూ ఉంటే మరొక పక్క వీటిని అడ్డుకునేందుకు సనాతనవాదులు మాత మౌడ్యాన్ని, మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్నారని డాక్టర్ సమరం తెలిపారు.
ఇటువంటి పరిస్థితుల్లో నాస్తికులు, హేతువాదులు, అభ్యుదయవాదులు కమ్యూనిస్టులు సోషలిస్టులందరి పైన కులాంతర, మతాంతర సమాజాన్ని నిర్మించడానికి తమ వంతు కృషి చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉందని ఆయన పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలోనే విజయవాడలో జరిగే 12వ ప్రపంచ నాస్తిక మహాసభల్లో పాజిటివ్ ఎటిజం, క్రిటికల్ థింకింగ్, సెక్యులర్ యాక్షన్ అనే థీమ్ ని ప్రాతిపదికగా చేసుకొని అనేక ప్రసంగాలను, కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు.
ప్రపంచ నాస్తిక మహాసభలో ప్రారంభం 4వ తేదీన 11 గంటలకు ఈ సభలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ ప్రపంచ మహాసభలను తమిళనాడుకు చెందిన ద్రవిడార్ కజగం అధ్యక్షులు కే వీరమణి ప్రారంభిస్తారని.
ఈ ప్రారంభ సభలో వీరితో పాటు విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసినేని చిన్ని, విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్, అవనిగడ్డ శాసనసభ్యుడు మండల బుద్ధ ప్రసాద్, వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు , అధికారి కామాల్ తౌరి, డాక్టర్ నరేంద్ర కుమార్, డాక్టర్ దేవరాజు మహారాజు తదితరులు పాల్గొంటారని తెలిపారు.
రెండవ రోజు మహాసభలు యూత్ సమ్మిట్ గా నిర్వహిస్తామని తెలిపారు .యువ సదస్సుని ఫౌండేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫర్మ్ సంస్థపకులైన డాక్టర్ జయప్రకాష్ నారాయణ ప్రారంభించడమే కాకుండా యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంతేకాకుండా యువ సదస్సులో జరిగే చర్చా గోష్టి కి ఆయన సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.
ఈ సదస్సులో పాల్గొనే 300 పైగా యువతను వివిధ గ్రూపులుగా విభజించి ప్రజాస్వామ్య పరిరక్షణ, శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం, క్రిటికల్ థింకింగ్ ,సెక్యులర్ ఆచరణ వంటి విషయాలపై చర్చా గోస్టులు నిర్వహిస్తామని డాక్టర్ సమరం తెలిపారు. కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత డాక్టర్ దేవరాజు మహారాజు ముఖ్య అతిథిగా తమ సందేశాన్ని అందిస్తారు.
అనంతరం కాన్ఫరెన్స్ డిక్లరేషన్ను ప్రకటిస్తారన్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ మహాసభల్లో దేశ విదేశాలకు చెందిన నాస్తికులు, హేతువాదులు, మేధావులు, పలువురు వివిధ అంశాలపై ప్రసంగిస్తారని తెలిపారు. విలేకరుల సమావేశంలో వికాస్ గోరా, నియంత, సకల, రష్మీ తదితరులు పాల్గొన్నారు.