Saturday, November 23, 2024

విశాఖలో మహిళా మార్టు.. 20 వేల మంది మహిళలతో 30 లక్షల పెట్టుబడి

అమరావతి, ఆంధ్రప్రభ: మహిళలను ఆర్థికంగా మరింత ముదుపరులుగా తయారుచేసి, వారిని పారిశ్రామిక, వ్యాపారవేత్తలుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మంచి ఫలితాలు వస్తున్నాయి. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఇప్పటికే ప్రభుత్వం అనేక విధాలుగా ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఈక్రమంలోనే సూపర్‌ మార్కెట్ల మాదిరిగానే మహిళా మార్టులు ఏర్పాటుచేస్తోంది. ఇప్పటికే తిరుపతి, పొద్దుటూరుల్లో జగనన్న మహిళా మార్టు (జేఎంఎం) పేరుతో విజయవంతంగా నడుస్తున్నాయి. ఇదే తరహాలో ఇప్పుడు విశాఖ నగరంలోనూ జేఎంఎం స్టోర్‌ ఏర్పాటు కాబోతోంది. దాదాపు 20 వేల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులతో దీనిని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ అన్ని రకాల కిరాణా సామాగ్రితోపాటు ఆహార పదార్థాలు, హస్తకళలు, పాల ఉత్పత్తులు మరియు సాధారణ వస్తువులు స్థానికంగా ఉండే సూపర్‌ మార్కెట్ల కంటే ఈ మార్టులలో తక్కువ ధరలకు విక్రయించనున్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు ఈ మార్టులో పెట్టు-బడిదారులుగా ఉండనున్నారు. ఈ తిరుపతి, పొద్దుటూరు మార్టులో ప్రతిరోజూ రూ. 2 లక్షల నుండి రూ. 3.5 లక్షల విలువైన వస్తువులను విక్రయిస్తున్నారు. అంతకంటే ఎక్కువగా ఈ మార్టులో విక్రయాలు జరపాలన్న లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు.

యూడీసీ ఆధ్వర్యంలో..

గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని అర్బన్‌ కమ్యూనిటీ- డెవలప్‌మెంట్‌ (యుసిడి) విభాగం నగరంలోని మల్కాపురంలో ఈమార్టును ఏర్పాటు చేసేందుకు 2,500 చదరపు అడుగుల భవనాన్ని గుర్తించారు. ఈ మార్టులో నెలవారీ అవసరాలకు ఉపయోగపడే సామాగ్రి మాత్రమే కాకుండా ఏటికొప్పాక బొమ్మలు, అరకు కాఫీ, కొండపల్లి బొమ్మలు మరియు ఉప్పాడ చీరలు వంటి ఉత్పత్తులను కూడా విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి స్వయం సహాయక గ్రూపులో ఉండే సభ్యురాలు జేఎంఎం యజమానిగా పరిగణించనున్నారు. వారి వ్యాపార వాటా తలకు రూ. 150 వంతున 20 వేల మంది సభ్యుల నుండి ఏకమొత్తంగా రూ. 30 లక్షలను సమీకరించనున్నారు. వీటిని ఉపయోగించి మార్టులో విక్రయించడానికి వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేయనున్నారు. అయితే, మహిళలను మరింతగా ప్రోత్సహించేందుకు ఈ మార్టుకు ఎలాంటి అద్దె వసూలు చేయకుండానే మార్టు కోసం జీవీఎంసీ భవనాన్ని వారికి ఇస్తోంది. జేఎంఎం సభ్యులు విద్యుత్‌ మరియు నీటి బిల్లులతో పాటు రన్నింగ్‌ ఛార్జీలను మాత్రమే చెల్లించేలా నిర్ణయించారు. తిరుపతి, ప్రొద్దుటూరులో నడుస్తున్న సూపర్‌మార్కెట్ల మాదిరిగానే మల్కాపురంలో ఏర్పాటు చేయబోయే మహిళా మార్ట్‌ కూడా మంచి వ్యాపారం చేస్తుందని జేఎంఎం సభ్యులు ఆశిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement