గుంటూరు, ఆంధ్రప్రభ వెబ్ ప్రతినిధి : ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు చేస్తున్నా మహిళలపై అఘాయిత్యాలు ఆగటంలేదు. మహిళల పై హింస ఆందోళనకర స్థాయికి చేరుకుంది. దీనికి శాశ్వత పరిష్కారంపై ప్రతిఒక్కరూ దృష్టి సారించాల్సిన
అవసరముంది. దాదాపు అన్ని రంగాల్లోనూ మహిళలు వివక్షను ఎదుర్కొంటున్నారు. లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయి. ఆ క్రమంలోనే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతమంది మహిళలు తమపై జరుగుతున్నా అఘాయిత్యాలు, వేధింపుల గురించి పైకి చెప్పుకోలేక లోలోన కుమిలిపోతున్నారు. కొద్దిమంది మాత్రమే తమకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటుతూ న్యాయంకోసం పోరాడుతున్నారు. మహిళలపై వివిధ రూపాలలో హింస, దాడులు ప్రపంచవ్యాప్తంగా అన్నీ దేశాలలో వుంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళా లేదా బాలిక మగవారి దురాగతాలకు బలవుతున్నారు. ఇది సభ్యసమాజం సిగ్గుపడాల్సిన అంశం. ప్రధానంగా మహిళలకు పెద్దపీట వేసి గౌరవించే సంప్రదాయం వున్న భారతదేశంలోనూ ఈ పరిణామాలు తీవ్రస్థాయిలో వుండటం ఒకింత ఆందోళన కలిగించేదే. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలలో బాలికలపైనే ఎక్కువగా జరుగుతున్నట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీన్ని తీవ్రంగా పరిగణించాల్సి వుంది. ముక్కుపచ్చలారని పసికందులపై దారుణాలకు ఒడిగట్టే వారు నాగరిక సమాజంలో జీవించటానికి అర్హులుకారు. వారిని కటినంగా శిక్షించాల్సిందే. ఎన్నో సందర్భాలలో నేరం చేసిన వారు యధేచ్చగా సంచరిస్తున్నా ఏమీచేయలేని నిస్సహాయ స్థితి తలెత్తుతోంది. ఈ విధమైన నేరాల విషయంలో సౌదీ, ఇరాన్, ఇరాక్ వంటి గల్ఫ్ దేశాలలో అమలవుతున్న చట్టాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. అందుకే ఆయా దేశాలలో మహిళలపై అత్యాచారాలు అనే సంఘటనలు కానరావు.
అయితే భారతదేశంలో చట్టాలు అమలులో తీవ్ర కాలయాపన జరుగుతుండటం వల్ల బాధితులకు న్యాయం జరగటం లేదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. దీన్ని ఆసరాగా తీసుకునే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారు మరింతగా రెచ్చిపోతున్నారు. అయితే ఈ విధమైన నేరాలకు పాల్పడే వారిలో ఎక్కువమంది ఆయా మహిళలకు సంబంధించిన కుటుంబాలతో సన్నిహితంగా వున్న వారే వున్నట్టు పలు సంఘటనలు రుజువుచేశాయి. తెలిసీ తెలియని యుక్త వయస్సులో ప్రేమాకర్షణకు గురై, అది విఫలమైన సందర్భాలలో కొన్ని ఉన్మాద సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ విధమైన సంఘటనలు ప్రతిరోజూ వివిధ మాద్యమాలలో వస్తూనే వున్నాయి. అయితే వెలుగులోకి రానివి ఎన్నో వున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆన్ లైన్ వ్యసనం సైతం ఈ విధమైన సంఘటనలకు ఆస్కారం కలిగిస్తోంది. ఏమాత్రం పరిచయంలేని మహిళల ఫోన్ నంబర్లు సేకరించి అసభ్య సందేశాలు పంపించటం, చాటింగ్ చేయటం వంటివి ఇటీవలి కాలంలో అధికమయ్యాయి. ఈ విధమైన పరిస్థితుల కారణంగా మహిళలు అన్నిరంగాల్లో భాగస్వామ్యం వహించలేకపోతున్నారు. వారి హక్కులకు స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. ఏ రంగమైనా మహిళా భాగస్వామ్యంతోనే అభివృద్ధి చెందగలవన్న సత్యాన్ని ప్రతిఒక్కరూ గ్రహించాలి. అన్ని రంగాలలో మహిళలు పని చేసే స్వేచ్చా వాతావరణాన్ని కల్పించాలి. దీనిపై జాతీయ స్థాయిలో
చర్చజరిగి ఒక నిర్ధిష్ట కార్యాచరణ రూపొందించాలి. మహిళా హక్కుల కోసం పోరాడే సంస్థలకు ప్రోత్సాహం అందించాలి. మహిళల పట్ల గౌరవం పెంపొందించే విధంగా అవగాహన పెంపుకు కృషి చేయాలి.