విజయవాడ – ‘‘వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రతి గ్రామంలో వాలంటీర్లను పెట్టి.. కుటుంబంలో ఎంత మంది ఉన్నారు.. వారిలో మహిళలు ఎందరు, వితంతువులున్నారా అని ఆరా తీస్తున్నారు. ఈ పాలనలో అదృశ్యమైన 30 వేల మందిలో 14 వేల మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. రాష్ట్రంలో మహిళల అదృశ్యాలకు వాలంటీర్లే కారణం” అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఏలూరులో మహిళల మిస్సింగ్‌పై పవన్ చేసిన ఆరోపణలపై ఆధారాలివ్వాలని కోరింది.. 10 రోజులలో సమాధానం ఇవ్వాలని నోటీస్ లో పేర్కొంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు మహిళల భద్రతకు భంగం కలిగేలా ఉన్నాయని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ నేడు విజయవాడలోజరిగిన మీడియా సమావేశంలో అన్నారు. వాలంటీర్లపై పవన్ విషం కక్కుతున్నారని మండిపడ్డారు. డైలాగ్స్ కొట్టి వెళ్లడం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు. రాజకీయాల కోసం పవన్ దిగజారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సీటు కోసం ఎవరినైనా ఫణంగా పెడతారా అని ప్రశ్నించారు. మహిళల మిస్సింగ్ గురించి ఆయనకు ఏ అధికారి చెప్పారో తమకు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మిస్సింగ్ కేసులు లేవా? అని నిలదీశారు. తాము ఇచ్చిన నోటీస్ లకు సరైన సమాధానం పవన్ నుంచి రానట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పద్మ .