Saturday, November 23, 2024

శభాష్​ పోలీస్​: కుళ్లిన శవాన్ని భుజాలపైకి మోసిన మహిళా ఎస్ఐ.. అడవిలో 5 కిలోమీటర్ల నడక!

కనిపించే పోలీసుల్లో మెజారిటీ కాఠిన్యానికి ఆనవాళ్లైతే.. కరుణకు ప్రతిరూపాలుగా కూడా అక్కడక్కడా కనిపిస్తారు! కరకు బూట్లతో కర్కశత్వానికి నిదర్శనంగా కనిపించే పోలీసులు నలుదిక్కులా అగుపిస్తే.. జాలీ దయకు నిలువుటద్దాలుగా ఎక్కడో ఒకచోట దర్శనమిస్తారు! అధికార దర్పాన్ని చాటుకునే పోలీసులు అడుగుకొకరు కనిపిస్తే.. ప్రేమ మూర్తులు మాత్రం ఎడారిలో ఒయాసిస్సులా తారసపడతారు..! ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మహిళా ఎస్ఐ కృష్ణపావని చాటిన మానవత్వపు పరిమళం.. శవం దుర్వాసననూ నిర్వీర్యం చేసేసింది! ఆమె చేసిన పని అందరినీ కదిలించింది!

క‌నిగిరి, ప్ర‌భ న్యూస్‌: ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం హాజీపురం గ్రామ అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటాన్ని గ్రామ పశువుల కాపరులు గుర్తించారు. అనంతరం స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. అప్రమత్తమైన కనిగిరి సీఐ పాపారావు, హనుమంతునిపాడు ఎస్ఐ కృష్ణ పావని తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి.. దుర్వాసన వస్తుండడంతో మృతదేహాన్ని.. దగ్గరగా వెళ్లి చూడడానికి అందరూ ఇబ్బంది పడ్డారు. అలాంటి స్థితిలో.. ఆ మృతదేహాన్ని అటవీ ప్రాంతం నుంచి రహదారి వరకు తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో మహిళా ఎస్​ఐ కృష్ణ పావని మరొకరి సాయంతో ఎదురు బొంగుకు మృతదేహాన్ని డోలిలా కట్టి.. సుమారు 5 కిలోమీటర్లు మోసుకొచ్చారు.

నడవటానికి వీలు లేని అటవీ ప్రాంతం నుంచి రహదారి ప్రాంతానికి అతి కష్టం మీద మృతదేహాన్ని మోసుకొచ్చారు. ఈ పని చేసిన మహిళ ఎస్ఐ కృష్ణ పావనిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ విధంగా.. ఆమెలో పరిమళించిన మానవత్వం.. శవం దుర్వాసననూ నిర్వీర్యం చేసిందనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement