Tuesday, November 26, 2024

Congress : ఐదు అంశాలతో.. ఐదు చోట్ల అగ్రనేతల సభలు : తులసీరెడ్డి

తిరుపతి (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో) : రాబోయే ఎన్నికల సన్నాహాలలో భాగంగా ఈ నెలాఖరులో కానీ, వచ్చేనెల మొదటి వారంలో కానీ సోనియా, రాహుల్, ప్రియాంక తదితరులతో రాష్ట్రంలోని ఐదు చోట్ల ఐదు ప్రత్యేక బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా సమన్వయ కర్త నర్రెడ్డి తులసీ రెడ్డి తెలిపారు. ఈరోజు స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఈ మేరకు నిన్న జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. వరుసగా విశాఖపట్నం, అమరావతి, తిరుపతి, రాజమహేంద్రవరం, కడపలలో ఆ సభలు ఉంటాయన్నారు. విశాఖ ఉక్కు, రాజధాని, ప్రత్యేక హోదా, పోలవరం, కడప ఉక్కు అనే అయిదు ప్రాధాన్య అంశాలపైనే సభలు ఉంటాయన్నారు.

ఆ సభల్లో తమ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఆ సభల ద్వారా తమ పార్టీని గెలిపిస్తే ఏం సాధిస్తామో చెబుతామన్నారు. తాము ఇచ్చే ముఖ్య హామీలన్నీ కేంద్ర నిధులతో చేపట్టాల్సినవే కనుక రాష్ట్ర బడ్జెట్ నిధులతో నిమిత్తం ఉండదని అంటూ ఇవికాక గతంలో తాము అమలు చేసిన సంక్షేమ పధకాలు కొనసాగిస్తామని చెబుతామన్నారు. అన్ని అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తామని చెబుతూ కలిసి వచ్చేవారి విషయంలో ఏం చేయాలో తమ అధినాయకత్వం చూసుకుంటుందన్నారు. పార్లమెంట్ లో నిన్న జరిగిన దాడికి బాధ్యత వహించి ప్రధాని, హోంశాఖ మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చిన హామీలను పట్టించుకోని జగన్ మోహన్ రెడ్డి వారి కన్నీటి వరదలో కొట్టుకుని పోవడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, ప్రమీలమ్మ, వెంకట నరసింహులు, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఆయన అంగన్వాడీ వర్కర్ల దీక్ష శిబిరంలో కూడా పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement