తిరుమల (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో ): ముంబైకి చెందిన విష్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ టీటీడీకి రూ.5 కోట్ల విలువైన 800 కిలోవాట్‌ల విద్యుత్ ఉత్పత్తి చేసే గాలిమరను విరాళంగా అందించారు. తిరుమల జిఎన్‌సి ప్రాంతంలో గాలిమర ఏర్పాట్లను ఈరోజు టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. విద్యుత్ శాఖ నుంచి అనుమతులు వచ్చిన తరువాత టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్నారు.
ఈ విద్యుత్ గాలిమర ద్వారా సంవత్సరానికి 18 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనివలన ప్రతి ఏడాది టీటీడీకి రూ.కోటి ఆదా అవుతుంది. కాగా ఇప్పటికే టీటీడీ అవసరాలకు 15 సంవత్సరాల క్రితమే ఈ కంపెనీ వారు 1.03 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే రెండు గాలి మర్లను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ బాధ్యతను ఈ కంపెనీ వారే చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న 0.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే గాలిమర నిర్వహణను కూడా వీరే చూడనున్నారు.
ఈ కార్యక్రమంలో జేఈవో సదా భార్గవి, సిఇ నాగేశ్వరరావు, ఎస్ ఈ -2 జగదీశ్వర్ రెడ్డి, డిఈ ఎలక్ట్రికల్ రవిశంకర్ రెడ్డి, ఇఇలు శ్రీ సురేంద్ర నాథ్ రెడ్డి, శ్రీనివాసులు, కంపెనీ ప్రతినిధులు ఇతర అధికారులు పాల్గొన్నారు.