Friday, November 22, 2024

AP: విశాఖ అభివృద్ధికి మరింత కృషి చేస్తా.. జీవీఎంసీ కమిషనర్

వంద రోజుల ప్రణాళికను అమలు చేసేందుకు కృషి
జీవీఎంసీ నూతన కమిషనర్ గా పి.సంపత్ కుమార్ బాధ్యతల స్వీకరణ
విశాఖపట్టణం, జులై 23(ప్రభ న్యూస్): అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరాన్ని మరింత అందమైన నగరంగా అభివృద్ధి పరచడంతో పాటు స్థానిక ప్రజల సమస్యలు, ప్రజాప్రతినిధులు సూచించిన సలహాలను పాటిస్తూ నగర అభివృద్ధికి విశేష కృషి చేస్తానని గ్రేటర్ విశాఖ నూతన కమిషనర్ పి.సంపత్ కుమార్ అన్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ గా సంపత్ కుమార్ మంగళవారం ఉదయం 11 గంటలకు పదవి బాధ్యతలు చేపట్టారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులను సమన్వయం చేసుకుంటూ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తానన్నారు. విశాఖ నగర అభివృద్ధికి వంద రోజులు ప్రణాళికల రూపొందించి దానిని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నగరాన్ని మరింత అభివృద్ధి పరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విశాఖలో ఉన్న సమస్యలను అవగాహన చేసుకుంటూ పెండింగ్ సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.

స్వచ్చంద్ర కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన సమయంలో విశాఖ నగరానికి సంబంధించి తనకు కాస్త అవగాహన ఉందని స్వచ్ఛ సర్వేక్షన్ లో కూడా ఉత్తమ రాంక్ సాధించేందుకు కృషి చేస్తానన్నారు. ఉద్యోగులు, సిబ్బందికి లక్ష్యాన్ని నిర్దేశించి వాటిని అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా ఉద్యోగులు, సిబ్బంది సంస్థల పరిష్కారానికి కూడా నెలలో రెండు రోజులు పాటు ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ముందుగా ఆయనకు వేద పండితుల ఆశీర్వచనం అందజేసి మృదుమదుర మంగళ వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు డాక్టర్ సన్యాసిరావు, యాదగిరి శ్రీనివాసరావు, సీసీపీ సురేష్ కుమార్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ నరేష్ కుమార్, జోనల్ కమిషనర్లు, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement