అమరావతి, ఆంధ్రప్రభ : గడిచిన మూడేళ్లుగా నీరు – చెట్టు బకాయిలు పెండింగ్లో పెట్టడం దుర్మార్గమైన చర్య అని ఇప్పటికే పలువురు ఆత్మహత్యలు చేసుకోగా.. వందలాది మంది అప్పుల ఊబిలోకి కూరుకుపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నీరు – చెట్టు ఫిర్యాదుల విభాగం బాధ్యులతో ఆయన సమావేశమై పెండింగ్ బిల్లుల పురోగతిపై సమీక్షించారు. నీరు – చెట్టు ఫిర్యాదుల విభాగం బాధ్యులు సాగునీటి సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణ పెండింగ్ బిల్లుల వివరాలను చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నీరు – చెట్టు పెండింగ్ బిల్లుల బకాయిల విడుదలకు కేవలం జీవోలు మాత్రమే ఇచ్చారని ఇప్పటి వరకు రైతుల ఖాతాలో నగదు జమ కాలేదని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు బిల్లుల చెల్లింపు కోసం 2237 మంది హైకోర్టును ఆదేశించారని ఆరు వారాల్లో బిల్లులు చెల్లించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా ఇంతవరకు చెల్లించలేదని దీంతో మరో 280 మంది బాధితులు మరోసారి కోర్టును ఆశ్రయించారని తెలిపారు. రూ. 200 కోట్ల చెల్లింపులకు ప్రభుత్వం జీవోలు ఇచ్చిందని ట్రెజరీ, ఇరిగేషన్ అధికారుల మధ్య సమన్వయం లోపంతో మరింత కాలయాపన జరుగుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేసి బకాయిలు చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఇప్పటికే అమలు చేయని పక్షంలో కోర్టు ధిక్కారణ పిటిషన్లు వేసి చెల్లింపులు జరిగేలా చూడాలని రైతులకు అండగా నిలవాలని నీరు – చెట్టు ఫిర్యాదుల విభాగం బాధ్యులకు చంద్రబాబు సూచించారు. ఈ సమావేశంలో కో – ఆర్డినేషన్ కమిటీ సభ్యులు జె. పుల్లయ్య, కె. రాజాచంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.