Friday, November 22, 2024

ప్రజల ఖాతాల్లో నేరుగా జమ చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందా?.. ఒంగోలు సభలో జగన్‌

ఒంగోలు, ప్రభన్యూస్‌ బ్యూరో: ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉండటాన్ని జీర్ణించుకోలేక పోతున్న దుష్ట చతుష్టయం బాబు పాలనే కావాలని కోరుకుంటోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం మూడో విడత కార్యక్ర మాన్ని శుక్రవారం ఒంగోలులో సీఎం బటన్‌ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తే రాష్ట్రం శ్రీలంకగా ఎందుకు మారుతుందో ప్రతిపక్షాలు చెప్పాలని.. ప్రజల సొమ్మును జేబుల్లో వేసుకుంటే అమెరికా అవుతుందా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో రాక్షసులు, దుర్మార్గులతో యుద్దం చేస్తున్నామన్నారు. ఒకే అబద్దానిన వంద సార్లు చెబుతూ గ్లోబల్‌ ప్రచారం చేస్తున్న వారికి బుద్ది రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సున్నా వడ్డీ రుణాల పథకాన్ని వరుసగా మూడో ఏడాది అమలు చేస్తూ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు చెల్లించాల్సిన రూ. 1261కోట్ల రూపాయలు బటన్‌ నొక్కి నేరుగా వాళ్ల బ్యాంకు అకౌంట్లల్లోకి జమ చేయడం జరిగిందన్నారు.

అధికారంలోకి వచ్చిన తరువాత తొలి,రెండో, మూడో ఏడాదిలో సున్నావడ్డీ పథకం కింద 1,02,16,410 మంది మహిళలకు లబ్ధి చేకూరే విధంగా రూ. 3,615 కోట్ల రూపాయలు అందించామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 36 నెలల కాలంలో రూ.1,36,694 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఎక్కడా కూడా లంచాలకు తావు లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జ మ చేసి మహిళలకు మేలు చేశామన్నారు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు ఎక్కడా అపాల‌ని, ప్ర జల ఇబ్బందులను నా ఇబ్బందులుగా భావించి సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నా చంద్రబాబే కావాలని ఎల్లోమీడియా ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు.

ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను చంద్రబాబులా పక్కన పడేస్తే రాష్ట్రం అమెరికా అవుతుందట అని ప్రశ్నించారు. ఎస్సీ,ఎస్టీ,బిసీ, మైనార్టీలకు ఈ పథకాలను ఆపేయాలని టీడీపీ నేతలు అంటున్నారని, పేదలకు మంచి చెయొద్దని చెబుతున్నారన్నారు. మంచి జరుగుతుంటే జీర్ణి ంచుకోలేని పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోందన్నారు. మహిళల్ని గత ప్రభుత్వం నట్టేట ముంచింది. సున్నా వడ్డీ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేయడమే కాకుండా, 12శాతం దాకా వడ్డీలు కట్టాల్సి వచ్చేదన్నారు. మహిళలకు రూ. 3,036 కోట్లు ఇస్తామని ఎగనామం పెట్టిందన్నారు. మన ప్రభుత్వ హయాంలో స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల సంఖ్య 80లక్షల నుంచి కోటి 2లక్షలకు పెరిగిందన్నారు. అక్క చెల్లెమ్మలను అప్పుల ఊబిలోంచి బయటకు తీసుకొచ్చామని, తద్వారా పొదుపు సంఘాల సభ్యుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు.

అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు కనిపిస్తోందని, చరిత్రలో నిలిచిపోయే విజయగాథ ఇది అని, ప్రభుత్వం పై నమ్మకమున్న అక్క చెల్లెమ్మల విజయగాథ ఇది అన్నారు. వైసీపీ మహిళా పక్షపాతి ప్రభుత్వమని, టీడీపీ హయాంలో 44లక్షల మందకి పెన్షన్లు ఇస్తే ..మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, రూ-.2500 అవ్వాతాత చేతుల్లో పెడుతున్నామని సీఎం జగన్‌ అన్నారు. ఇదిలా ఉండగా, వివిధ పథకాల ద్వారా పొందిన లబి ్ధతో మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందన్నారు. ఇందులో భాగంగా ఐటీసీ, హెచ్‌యూఎల్‌, పీఅండ్‌జీ, రిలయెన్స్‌ రిటైల్‌, అమూల్‌, గ్రామీణ వికాస కేంద్రం, మహేంద్ర వంటి కంపెనీలతో ఇప్పందాలు కుదర్చడంతో పాటు రుణాల కోసం బ్యాంకులను అనుసంధానం చేయడం జరిగిందన్నారు. వడ్డీ శాతాన్ని 13.50 నుంచి 9.50 – 8.50 శాతంకు తగ్గించేలా బ్యాంకులను ఒప్పించడం జరిగిందన్నారు.

మహిళలకు అండగా వైసీపీ ప్రభుత్వం
రాష్ట్రంలో ప్రతి ఇంటి చరిత్రను స్వర్ణక్షరాలతో తిరిగి రాస్తా ఉన్న అక్కచెల్లెమ్మలందరికీ మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ జగన్‌ నిండు మనసుతో అందరికీ బ్యాంకుల నుంచి పొదుపు సంఘాలు రుణాలు తీసుకొని సకాలంలో తిరిగి చెల్లించిన అందరికీ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకాన్ని వరుసగా మూడో ఏడాది అమలు చేస్తూ పొదుపు సంఘాల మహిళలకు చెల్లించాల్సిన రూ.1261 కోట్ల రూపాయలు బటన్‌ నొక్కి నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేశామన్నారు.

- Advertisement -

చంద్రబాబు చేసిన అప్పుల కంటే తక్కువే చేసాం
చంద్రబాబు హయాంలో అయినా..మన హయాంలో అయినా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఒక్కటే. చేస్తున్న అప్పులూ అవే..మరి ఆయన హయాంలో ఆయనకు వచ్చిన ఆదాయం అదే..ఆయన చేసిన అప్పులూ అవే.. మన హయాంలో వచ్చిన ఆదాయం అంతే అయినప్పటికీ.. అప్పులు ఆయన కంటే తక్కువే చేశామని జగన్‌ అన్నారు. అలాంటప్పుడు జగన్‌ ఎలా చేయగలుగుతున్నాడు.. ఆ పెద్ద మనిషి ఎందుకు చేయలేక పోయాడని ప్రశ్నించారు. జగన్‌ బటన్‌ నొక్కడం ద్వారా నేరుగా ప్రజల దగ్గరకు వెళుతుండగా.. చంద్రబాబునాయుడు బటన్‌ నొక్కడు, ఆయన పరిపాలన అంతా కూడా ఆయనకు మంచి చేసుకోవడం, ఆయన చుట్టూ ఉన్న ఎల్లోమీడియాతో పాటు, గ్రామాల్లోని జన్మభూమి కమిటీ సభ్యులకు మంచి చేసుకునేందుకే ఆయన పరిపాలన సాగిందని జగన్‌ విమర్శించారు. అదే బడె ్జట్‌, అదే రాష్ట్ర వనరులు, అవే అప్పులు అయినా చంద్రబాబు పరిపాలన ఒక మాదిరిగా ఉండగా, అంతకన్నా కాస్త తక్కువ అప్పులు చేసినా జగన్‌ పరిపాలన చంద్రబాబుకన్నా చాలా..చాలా గొప్పగా ఉందన్నారు.

రాష్ట్రంలో కనీవినీ ఎరుగని విధంగా విప్లవాత్మక మార్పులు జరుగుతున్నామన్నారు. 70శాతం మంత్రి పదవులు ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు ఇచ్చామన్నారు. సామాజిక న్యాయం అనేది మాటల్లో కాదు..చేతల్లో చూపించాలన్నారు. మొదటి దప మంత్రి వర్గంలో 56శాతం ఇవ్వడమే ఒక చరిత్ర అయితే, ఇప్పుడు 70 శాతం పదవులు ఈ వర్గాలకే ఇవ్వడం ఒక మహా చరిత్ర అన్నారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల పదవులు ఉంటే, అందులో నాలుగు ఎస్సీ,ఎస్టీ, బిసీ, మైనార్టీలకే ఇచ్చామన్నారు. విజయవాడచ కృష్ణా జిల్లాల్లో మేయర్‌ తో పాటు, జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ పదవులు జనరల్‌ కేటగిరిలో బిసీలకు ఇచ్చామన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా అన్ని వర్గాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. జగన్‌ న్యాయం చేస్తున్నాడా లేదా అనేది ప్రతి ఒక్కరు మనస్సాక్షిగా ఆలోచించాలని సీఎం జగన్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి ఆదిమూలపు సురేష్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సెర్ప్‌ సిఇవో ఇంతియాజ్‌, ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర అధికారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement