రాష్ట్రపతి నిలయాన్ని రాజకీయాలకు వేదికగా మార్చారని, ఎన్టీఆర్ నాణెం విడుదలపై నీచ రాజకీయాలు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు రాక్షస ప్రవృత్తితో ప్రవర్తించారని, ఢిల్లీ వెళ్లి హడావుడి చేశారే తప్ప, మరేంలేదన్నారు. ఇక.. పురంధేశ్వరి టీడీపీ ఏజెంట్ లా మారారని ఘాటు వ్యాఖ్యాలు చేశారు.
ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతిని అవమానించారని, లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న విషయం నిజం కాదా అని ప్రశ్నించారు సజ్జల. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన వారే ఇప్పుడు తామే ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, బిజెపి..టిడిపి కలిసినా తమకు భయం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి..బిజెపి..పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసిన పర్వాలేదని, లోకేష్ పాదయాత్రకు టిడిపి కార్యకర్తలే రావడం లేదని ఎద్దేవా చేశారు.
టిడిపిపై ప్రజలకు నమ్మకం లేదని, 175 స్థానాల్లో పోటీ చేయడానికి టిడిపి సిద్ధంగా కూడా లేదన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంపై 70శాతం మంది పాజిటివ్ గా ఉన్నారని, ఎంతసేపూ టైటానిక్ సినిమా లాగా ప్రజలకు చంద్రబాబు గ్రాఫిక్ చూపిస్తున్నారని అన్నారు. అలా ప్రజలను భ్రమలలో పెడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా విషయాన్ని చంద్రబాబు ఎప్పుడో మర్చిపోయారని సజ్జల విమర్శించారు.