Saturday, November 23, 2024

ఆ బంధం చిగురిస్తుందా.. పొత్తు దిశగా టీడీపీ, బీజేపీ అడుగులు!

అమరావతి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తిని రేపుతున్నాయి. ఎన్నికల పోరు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పరిణామాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటూ వస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా దాదాపు ఏడాదిన్నర గడువు ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలన్నీ ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తూ పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా అధికార పీఠాన్ని మళ్లి సొంతం చేసుకోవాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ చకచకా అడుగులు వేస్తూ, కొత్త రాజకీయ సమీకరణాలతో ముందుకు సాగుతోంది. తాజాగా టీడీపీ, బీజేపీలు మైత్రి దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటి వరకు తెదేపా, బీజేపీల పొత్తుల అంశంలో ఊహాజనితమైన చర్చ సాగుతూ వస్తోంది. అయితే తాజా పరిణామాలు రెండు పార్టీల మధ్య బంధం చిగురిస్తున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. త్వరలోనే టీడీపీ ఎన్డీయేలో చేరడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి బలంగా వినిపిస్తోంది. దాదాపు నాలుగేళ్ల విరామం అనంతరం ఢి ల్లిdలో ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ అయిన నాటినుంచి రాజకీయ పరిణామాల మారుతూ వస్తుండటం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. మరోవైపు అధికార పార్టీ అయిన వైకాపా నేతలు కూడా టీడీపీ, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయని వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పొత్తులపై ఈ మూడు పార్టీలు తమ వైఖరిని ప్రకటించకున్నా పొత్తులు ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లు ఈ పొత్తులపై ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీతో జనసేన, బీజేపీలు కలిసి నడుస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2014 ఎన్నికల సీన్‌ మళ్లి రిపీట్‌ అవడం ఖాయమన్న ధీమాలో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు. ఇదిలా ఉంటే రానున్న విజయదశమికి టీడీపీ ఎన్డీయేలో చేరుతుందన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఢిల్లి పెద్దల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా చంద్రబాబుకు అదనపు భద్రత కల్పించడం, ఢిల్లిలో టీడీపీకి పాజిటివ్‌గా బీజేపీ అగ్రనేతలు మాట్లాడుతూ వస్తుండటమే బంధానికి సంకేతాలని టీడీపీ నేతలు పేర్కొన్నారు.

ఈ పొత్తులు ఖాయమైతే రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీకి టీడీపీ, జనసేన పొత్తు అవసరమని ఆ పార్టీ ఇప్పుడిప్పుడే అక్కడ బలపడుతున్న నేపథ్యంలో ఈ పొత్తులు మరింత ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. ఏపీలో టీడీపీ మద్దతిస్తే తెలంగాణలో మరింత బలపడవచ్చన్న యోచనలో బీజేపీ అధిష్టానం ఉందని ఈ నేపథ్యంలోనే పొత్తులపై పూర్తి క్లారిటీతో వ్యూహాలు రచిస్తున్నారన్న వాదనను వినిపిస్తున్నారు. తెలంగాణలో టీడీపీ ప్రాబల్యం తగ్గిపోయినప్పటికీ బలమైన ఓట్‌ బ్యాంక్‌ ఉందని మరోవైపు జనసేన కూడా ప్రభావితం చేస్తుందన్న అభిప్రాయం బీజేపీ అగ్ర నేతల్లో బలంగా ఉంది. ఈ పరిస్థితుల్లో పొత్తులతో ముందుకు వెళితే తెలంగాణలో బలమైన శక్తిగా ఎదగొచ్చన్న ఆలోచనతో పక్కా వ్యూహాలను బీజేపీ సిద్ధం చేసుకుంటుందన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో బీజేపీ మళ్లి పొత్తు ఖాయమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement